శ్రీలంకతో టీ-20 సిరీస్ లో భారత్ ' సూపర్ ' స్వీప్!

శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. ఆఖరి టీ-20ని భారత్ 'సూపర్ ఓవర్' తో గెలుచుకొంది.

Advertisement
Update:2024-07-31 18:36 IST

శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. ఆఖరి టీ-20ని భారత్ 'సూపర్ ఓవర్' తో గెలుచుకొంది.

ప్రపంచ చాంపియన్ భారత్ మరో టీ-20 సిరీస్ ను అలవోకగా గెలుచుకొంది. మాజీ చాంపియన్ శ్రీలంకను లంక గడ్డపై జరిగిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయంతో చిత్తు చేసింది.

ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా భారత్ 2-0తో సిరీస్ ఖాయం చేసుకోడంతో ఆఖరి మ్యాచ్ నామమాత్రమేనని అందరూ అనుకొన్నారు. అయితే..రెండుజట్లు అద్భుతంగా పోరాడంతో మ్యాచ్ రక్తికట్టింది.

నిర్ణిత ఓవర్లలో రెండుజట్లూ 137 పరుగుల స్కోర్లే సాధించడంతో..విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ విధానం అనుసరించారు.

భారత్ టాపార్డర్ టపటపా....

భారత్ కు చెలగాటం..శ్రీలంకకు పరువుకు సంకటంగా మారిన ఆఖరి మ్యాచ్ లో టాస్ నెగ్గిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొంది. భారత్ మూడుమార్పులతో పోటీకి దిగింది.

వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల లకు విశ్రాంతి నిచ్చి పేసర్ ఖలీల్, స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లకు తుదిజట్టులో చోటు కల్పించారు.

రెండో టీ-20లో విఫలమైన సంజు శాంసన్ కు మరో అవకాశం కల్పించడంతో తుదిజట్టులో వికెట్ కీపర్ గా కొనసాగాడు. అయితే..బ్యాటింగ్ కు అంతగా అనువుగా లేని పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ పవర్ ప్లే ఓవర్లు ముగియకుండానే నాలుగు టాపార్డర్ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

యశస్వి 10, సంజు శాంసన్ 0, రింకూసింగ్ 1, కెప్టెన్ సూర్యకుమార్ 8, ఆల్ రౌండర్ శివం దూబే 13 పరుగులకే వెనుదిరగడంతో ..భారత్ 48 పరుగులకే 5 వికెట్లు నష్టపోయింది.

అయితే..వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, రియన్ పరాగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

శుభ్ మన్ 39, రియన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులతో తమజట్టును ఆదుకొన్నారు.

సూర్య సూపర్ మ్యాజిక్.....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయాల్సిన శ్రీలంకకు ఓపెనర్లు నిస్సంక, కుశల్ మెండిస్ మొదటి వికెట్ కు 58 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

నిస్సంక 26, కుశల్ మెండిస్ 43, కుశల్ పెరెరా 46 పరుగులతో శ్రీలంక విజయానికి మార్గం సుగమం చేశారు. అయితే ..మరోసారి శ్రీలంక మిడిలార్డర్ పేకమేడలా కూలిపోయింది.

ఇన్నింగ్స్ 20 ఓవర్ ..ఆరు బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయాల్సిన శ్రీలంక..భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పిన్ బౌలింగ్ జాదూలో గల్లంతయ్యింది. సూర్య 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో స్కోర్లు 137-137 కావడంతో సూపర్ ఓవర్ లో విజేతను నిర్ణయించాల్సి వచ్చింది.

కమిందు మెండిస్, రమేశ్ మెండిస్, మహేశ్ తీక్షణ వికెట్లను సూర్యకుమార్ పడగొట్టాడు. సూర్య ఒక ఓవర్లో 5 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా..టీ-20ల్లో తన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగలిగాడు.

సూపర్ ఓవర్లో శ్రీలంక 2 వికెట్లకు 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా భారత్ 2 బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేయడం ద్వారా

విజేతగా నిలిచింది. భారత్ మూడుకు మూడుమ్యాచ్ లూ నెగ్గి క్లీన్ స్వీప్ విజయం పూర్తి చేసింది.

' ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' సూర్యకుమార్...

ఈ సిరీస్ లో అత్యుత్తమ ప్లేయర్ అవార్డును భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గెలుచుకొన్నాడు. ఆఖరి టీ-20 బెస్ట్ ప్లేయర్ అవార్డును వాషింగ్టన్ సందర్ అందుకొన్నాడు.

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజయం తరువాత టాప్ ర్యాంకర్ భారత్ తన తొలి టీ-20 సిరీస్ లోనే 8వ ర్యాంకర్ శ్రీలంకను చిత్తు చేయడం ద్వారా తనకు పోటీనే లేదని చాటుకొంది.

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ ఆగస్టు 2న ప్రారంభంకానుంది. భారత వన్డే జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో పోటీకి దిగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ సైతం సిరీస్ లో పాల్గొంటున్నాడు.

నయాకోచ్ గౌతం గంభీర్ కు ఇదే తొలి వన్డే సిరీస్ కానుంది.

Tags:    
Advertisement

Similar News