ఐసీసీ టెస్టులీగ్ లో భారత ఓపెనర్ల రికార్డుల మోత!
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టులీగ్ లో భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ ల దూకుడుకొనసాగుతోంది.
ఐసీసీ టెస్టులీగ్ లో భారత ఓపెనింగ్ జోడీ రికార్డుల మోత మోగించారు. రహానే- విరాట్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించారు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టులీగ్ లో భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ ల దూకుడుకొనసాగుతోంది. ప్రపంచ టెస్టులీగ్ లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రోహిత్, యశస్వి జంట నిలిచింది. ఈ ఇద్దరు ఓపెనర్లు వ్యక్తిగతంగా కూడా పలు అరుదైన రికార్డులు నమోదు చేశారు.
ధర్మశాలటెస్టులో సరికొత్త రికార్డు...
టెస్టు లీగ్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన విరాట్ కొహ్లీ- అజింక్యా రహానేల రికార్డును రోహిత్- యశస్విజంట తెరమరుగు చేశారు. విరాట్- రహానేల పేరుతో ఉన్న 876 పరుగుల భాగస్వామ్యాన్ని రోహిత్- యశస్విజోడీ 980 పరుగులతో అధిగమించారు.
ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి నాలుగుటెస్టులు ముగిసే సమయానికే 876 పరుగుల భాగస్వామ్యంతో విరాట్- రహానే రికార్డును సమం చేసిన రోహిత్- యశస్విజంట..ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరిటెస్టు తొలిరోజుఆటలో మొదటి వికెట్ కు ( 104 పరుగుల) సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేయగలిగారు.
రోహిత్- పూజారా జోడీ 816 పరుగులు, విరాట్ - జడేజా జోడీ 753 పరుగులు, విరాట్- పూజారా 751 పరుగులు, రోహిత్- గిల్ జోడీ 710 పరుగులతో ఆ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.
712 పరుగులతో యశస్వి జైశ్వాల్ సరికొత్త చరిత్ర...
ఇంగ్లండ్ తో జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డును 22 సంవత్సరాల యశస్వి జైశ్వాల్ నెలకొల్పాడు. అంతేకాదు..2023-25 లీగ్ సైకిల్ లో ముందుగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డును సైతం యశస్వి సాధించాడు.
ప్రస్తుత సిరీస్ లోని రాంచీ టెస్టు ముగిసేనాటికే రెండు డబుల్ సెంచరీలతో సహా 655 పరుగులు సాధించిన యశస్వి...ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సాధించిన హాఫ్ సెంచరీతో 712 పరుగులు చేయడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
అత్యంత వేగంగా 1000 పరుగుల రెండో బ్యాటర్...
టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరిన భారత రెండో బ్యాటర్ గా యశస్వి రికార్డుల్లో చోటు సంపాదించాడు. కేవలం 14 ఇన్నింగ్స్ లోనే అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ వినోద్ కాంబ్లీ కాగా..ఆ తరువాత స్థానంలో యశస్వి చేరాడు.
యశస్వి వెయ్యి పరుగుల మైలురాయిని చేరటానికి 16 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది.
అంతేకాదు..ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో 700కు పైగా పరుగులు సాధించిన భారత రెండో ఓపెనర్ గా యశస్వి నిలిచాడు. వెస్టిండీస్ పై సునీల్ గవాస్కర్ 700 పరుగులు సాధించగా..ఇంగ్లండ్ ప్రత్యర్థిగా విరాట్ కొహ్లీ సాధించిన అత్యధిక పరుగుల రికార్డును సైతం యశస్వి తెరమరుగు చేశాడు.
2016 ఇంగ్లండ్ సిరీస్ లో విరాట్ కొహ్లీ సాధించిన 655 పరుగుల రికార్డును యశస్వి 712 పరుగులతో తిరగరాశాడు. 2002 ఇంగ్లండ్ సిరీస్ లో రాహుల్ ద్రావిడ్ 602 పరుగులు, 2018 సిరీస్ లో విరాట్ 593 పరుగులు, 1961-62 సిరీస్ లో విజయ్ మంజ్రేకర్ 586 పరుగులు, 1979 సిరీస్ లో సునీల్ గవాస్కర్ సాధించిన 542 పరుగుల రికార్డులను చిరుప్రాయంలోనే యశస్వి జైశ్వాల్ అధిగమించగలిగాడు.
1971 వెస్టిండీస్ సిరీస్ లో సునీల్ గవాస్కర్ సాధించిన 774 పరుగుల రికార్డును తెరమరుగు చేయాలంటే..ధర్మశాల టెస్టు రెండో ఇన్నింగ్స్ లో యశస్వి మరో 26 పరుగులు చేయాల్సి ఉంది.
సిక్సర్లబాదుడులో రోహిత్ సరికొత్త రికార్డు....
ప్రపంచ టెస్టులీగ్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ రికార్డును రోహిత్ శర్మ సొంతం చేసుకొన్నాడు. ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తొలి సిక్సర్ బాదడం ద్వారా 50 సిక్సర్ల మార్కు చేరడం ద్వారా ఈ ఘనతను సాధించాడు.
టెస్టులీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరుతో ఉంది. స్టోక్స్ మొత్తం 44 మ్యాచ్ ల్లో 78 సిక్సర్లు బాదడం ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 32 టెస్టుల్లో 52 సిక్సర్లు సాధించడం ద్వారా రెండోస్థానంలో నిలిచాడు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 24 టెస్టుల్లో 38 సిక్సర్లు, జానీ బెయిర్ స్టో 34 మ్యాచ్ ల్లో 27 సిక్సర్లు, యశస్వి జైశ్వాల్ 8 టెస్టుల్లో 26 సిక్సర్లతో ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్ల రికార్డును చేరాలంటే రోహిత్ మరో 3 సిక్సర్లు బాదాల్సి ఉంది. ప్రస్తుత ధర్మశాల టెస్టుతో సహా 472 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 597 సిక్సర్లతో నంబర్ వన్ సిక్సర్ హిట్టర్ గా రికార్డు నెలకొల్పాడు.
కరీబియన్ దిగ్గజం క్రిస్ గేల్ 483 మ్యాచ్ ల్లో 553 సిక్సర్లతో రెండు, పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిదీ 524 మ్యా్చ్ ల్లో 476 సిక్సర్లు, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 432 మ్యాచ్ ల్లో 398, కివీ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 367 మ్యాచ్ ల్లో 383 సిక్సర్లతో మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.