ఐపీఎల్ ప్రాతిపదికనే ప్రపంచకప్ కు భారతజట్టు ఎంపిక!
వెస్టిండీస్, అమెరికా క్రికట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 1న ప్రారంభం కానున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే చోటు ఖాయమయ్యింది.
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో కేవలం నలుగురికి మాత్రమే చోటు ఖాయమయ్యింది. మిగిలిన 11 స్థానాల భర్తీ కోసం ఐపీఎల్ లో కనబరచిన ప్రతిభనే ప్రాతిపదిక చేసుకోనున్నారు..
వెస్టిండీస్, అమెరికా క్రికట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 1న ప్రారంభం కానున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో కేవలం నలుగురు ఆటగాళ్లకు మాత్రమే చోటు ఖాయమయ్యింది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీకి సైతం తుదిజట్టులో చోటుకు గ్యారెంటీ లేకుండాపోయింది.
ఎవరా నలుగురు...?
ఐపీఎల్ 17వ సీజన్లో సత్తా చాటినా..చాటుకోకున్నా ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు ఖాయం చేసుకొన్న ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు..వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నారు.
జట్టులోని మిగిలిన 11 బెర్త్ ల కోసం పోటీ హోరాహోరీగా సాగనుంది. ప్రస్తుత ఐపీఎల్ లో నిలకడగా రాణించడం ద్వారా సత్తా చాటుకొన్న ఆటగాళ్లకే భారతజట్టులో చోటు దక్కే అవకాశం ఉందని ఎంపిక సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
ఐపీఎల్ ఆఖరి వారంలో భారతజట్టు ఎంపిక...
ఏడువారాల ఐపీఎల్ ఆఖరి వారం మ్యాచ్ ల సమయంలోనే..ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని బీసీసీఐ ఎంపిక సంఘం ఖరారు చేయనుంది.
ఓపెనర్ స్థానం నుంచి 11వ నంబర్ ఆటగాడి స్థానం వరకూ పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. చివరకు విరాట్ కొహ్లీ సైతం తన బెర్త్ కోసం పలువురు యువబ్యాటర్లతో పోటీపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
జట్టులోని రెండో ఓపెనర్ స్థానం కోసం యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గయక్వాడ్, పృథ్వీ షా పోటీపడుతున్నారు.
వికెట్ కీపర్ స్థానం కోసం ఐదుగురు పోటీ...
కీలక వికెట్ కీపర్ స్థానం కోసం గతంలో ఎన్నడూలేనంతగా పోటీ నెలకొంది. ఒకరికాదు..ఇద్దరు కాదు..ఐదుగురు పోటీలో ఉన్నారు. రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ పోటీపడుతున్నారు.
రాహుల్ మినహా మిగిలిన నలుగురు ప్రస్తుత ఐపీఎల్ లో స్థాయికి తగ్గట్టుగా ..నిలకడగా ఆడగలిగితేనే తమ తమ బెర్త్ లను దక్కించుకొనే అవకాశం ఉంది.
జట్టులోని లెగ్ స్పిన్నర్ స్థానం కోసం యజువేంద్ర చాహల్, రవి బిష్నోయ్ తలపడుతున్నారు.
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో యశస్వీ జైశ్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషభ్ పంత్ ( వికెట్ కీపర్ ) కెఎల్ రాహుల్ ( వికెట్ కీపర్ ), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ లను ఎంపిక చేసే అవకాశం ఉంది.
ప్రస్తుత ఐపీఎల్ లో హార్ధిక్ పాండ్యా నిలకడగా రాణించకుంటే..ముంబై ఆల్ రౌండర్ శివం దూబేను ప్రపంచకప్ కు ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.
ప్రపంచకప్ గ్రూప్- ఏలో భారత్ పోరు...
మొత్తం 20 జట్లు తలపడనున్న ప్రపంచకప్ గూప్ లీగ్-ఏలో మాజీ చాంపియన్ భారత్ పోటీపడనుంది. 2007 ప్రారంభ ప్రపంచకప్ తరువాత మరో టైటిల్ కోసం భారతజట్టు తహతహలాడుతోంది. గ్రూపు-ఏలో పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లతో భారత్ పోటీపడాల్సి ఉంది. తొలిదశ గ్రూపు లీగ్ నుంచి సూపర్ -8 రౌండ్ కు అగ్రస్థానాలలో నిలిచిన జట్లు చేరుకోనున్నాయి.