ఆఖరిమెట్టుపై బోల్తాతో భారత క్రికెటర్ల కన్నీరు మున్నీరు!

ప్రపంచకప్ ఫైనల్లో పరాజయంతో భారత క్రికెటర్లు కన్నీరు మున్నీరయ్యారు. తీవ్రవిచారంలో మునిగిపోయారు...

Advertisement
Update:2023-11-20 09:50 IST

ప్రపంచకప్ ఫైనల్లో పరాజయంతో భారత క్రికెటర్లు కన్నీరు మున్నీరయ్యారు. తీవ్రవిచారంలో మునిగిపోయారు...

గత ఆరువారాలుగా సాగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ వరకూ 10 విజయాలతో దూసుకొచ్చి..కేరింతలు కొట్టిన భారత క్రికెటర్లు ఒక్కసారిగా తీవ్రవిచారంలో మునిగిపోయారు. టైటిల్ సమరంలో ఎదురైన ఓటమితో మానసికంగా కృంగిపోయారు.

పాపం...రోహిత్ శర్మ......

భారత్ కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. 36 సంవత్సరాల రోహిత్ కు వన్డే ప్రపంచకప్ లో సైతం నిరాశే ఎదురయ్యింది.

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా చేతిలో ఎదురైన ఓటమి జ్ఞాపకాల నుంచి బయటపడకముందే..వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సైతం పరాజయం తప్పలేదు.

రౌండ్ రాబిన్ లీగ్ 9 రౌండ్ల మ్యాచ్ లతో పాటు..సెమీఫైనల్స్ వరకూ జట్టును ముందుండి నడిపించడమే కాదు.. ఫైనల్స్ వరకూ తీసుకువచ్చిన రోహిత్..టైటిల్ పోరులో మాత్రం విఫలమయ్యాడు. గత కొద్దివారాలుగా తాము పడిన కష్టానికి తగిన ఫలితం దక్కకపోడంతో రోహిత్ తీవ్రవిచారంలో పడిపోయాడు. ఆస్ట్ర్రేలియా చేతిలో 6 వికెట్ల ఓటమి తరువాత తన కంటనీరును నియంత్రించుకోడానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్ గా జంట రికార్డులు సాధించిన రోహిత్..ప్రపంచకప్ ను అందుకోలేకపోడంతో నిరాశలో పడిపోయాడు. తమజట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ప్రపంచకప్ ను కానుకగా ఇవ్వలేకపోయినందుకు లోలోన కుమిలిపోతున్నాడు.

విరాట్ కొహ్లీ ఆనందం ఆవిరి....

ప్రస్తుత ప్రపంచకప్ లో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో సహా 765 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విరాట్ కొహ్లీ ఆనందం ఆవిరైపోయింది. తమజట్టు ప్రపంచకప్ ను గెలుచుకోలేకపోడంతో నిరాశలో మునిగిపోయాడు. తన ముఖాన్ని ఇండియా క్యాప్ మాటున దాచుకొంటూ విచారాన్ని దిగమింగాడు.

యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన దుఖాన్ని ఆపుకోలేక గ్రౌండ్లోనే డిలా పడిపోయాడు. సిరాజ్ ను మరో ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఓదార్చుతూ కనిపించాడు.

అయ్యో...రాహుల్ ద్రావిడ్....

భారత క్రికెటర్ గా ప్రపంచకప్ సాధించలేని తాను..కనీసం జట్టు చీఫ్ కోచ్ గా నైనా ప్రపంచకప్ అందుకోవాలని భావించిన రాహుల్ ద్రావిడ్ సైతం తీవ్రనిరాశకు లోనయ్యాడు.

ఓటమితో తమ డ్రెస్సింగ్ రూమ్ లో అంతులేని మౌనం రాజ్యమేలిందని, గత కొద్దివారాలుగా వరుస విజయాలతో కేరింతలు కొట్టిన ఆటగాళ్లందరూ ఫైనల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని, కొందరు తమ శోకాన్ని ఆపుకోలేకపోయారని ద్రావిడ్ వివరించారు.

ఫైనల్లో తాము గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని, పడిన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని..టైటిల్ సమరానికి ముందు వరకూ తమజట్టు గొప్పగా ఆడిందని, దానికి తాను గర్వపడుతున్నానని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత ప్రపంచకప్ ముగియడంతోనే భారత చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు సైతం ముగిసిపోయింది. తన భవిష్యత్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని తేల్చిచెప్పారు.

తాము 290 పరుగుల స్కోరు సాధించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, తమకంటే మెరుగ్గా ఆడిన ఆస్ట్ర్రేలియా విజేతగా నిలవడానికి అర్హమైన జట్టుగా కితాబిచ్చాడు.

భారతజట్టులోని రోహిత్ వయసు 36, విరాట్ 35, అశ్విన్ 37సంవత్సరాల వయసు వారు కావడంతో ..వారి కెరియర్ లో ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్ గా మిగిలిపోనుంది.

2011 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో విరాట్ మాత్రమే సభ్యుడిగా ఉన్నాడు. 2007 టీ-20 ప్రపంచకప్ చాంపియన్ గా నిలిచిన భారత జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు.

భారత క్రికెట్ కు అపురూప సేవలు అందించిన అశ్విన్ మాత్రం ప్రపంచకప్ ట్రోఫీ లేకుండానే తన కెరియర్ ను ముగించడం బాధకరమే...

Tags:    
Advertisement

Similar News