ఆసియా కుస్తీలో దిగజారిన భారత్!

2024-ఆసియాకుస్తీ పోటీలలో భారత్ దారుణంగా విఫలమయ్యింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది.

Advertisement
Update:2024-04-17 14:13 IST

2024-ఆసియాకుస్తీ పోటీలలో భారత్ దారుణంగా విఫలమయ్యింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది.

రాజకీయాలు భారత కుస్తీని గట్టిగానే దెబ్బతీశాయి. సీనియర్ రెజ్లర్లకు జాతీయ కుస్తీ సమాఖ్య పెద్దల నడుమ గత కొద్దిమాసాలుగా సాగిన కుస్తీ ప్రభావం ఫలితాలపైన బాగానే పడింది. పారిస్ ఒలింపిక్స్ కుస్తీలో పాల్గొనటానికి భారత వస్తాదులు ఒక్కబెర్త్ మాత్రమే సాధించగలిగారు.

14 నుంచి 9 పతకాలకు...

బిష్ కెక్ వేదికగ ముగిసిన 2024 ఆసియా కుస్తీ చాంపియన్షిప్ ప్రీ-స్టయిల్, గ్రీకో-రోమన్ విభాగాలలో భారత వస్తాదులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రధానంగా ఫ్రీ-స్టయిల్ కుస్తీలో భారత్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది.

సీనియర్ వస్తాదులు వినేశ్ పోగట్, భజరంగ్ పూనియా, సాక్షీ మాలిక్ దూరం కావడంతో ఆసియా కుస్తీలో భారత్ పోటీ నామమాత్రంగా మిగిలింది.

4 రజతాలు, 5 కాంస్యాలతో సరి....

కిర్గిజిస్థాన్ ఆతిథ్యంలో జరిగిన ప్రస్తుత ఆసియాకుస్తీ పోటీల ఫ్రీ-స్టయిల్ విభాగంలో భారత వస్తాదులు 4 రజత, 5 కాంస్యాలతో సహా మొత్తం 9 పతకాలు మాత్రమే సాధించగలిగారు.

ఫ్రీ-స్టయిల్, గ్రీకో-రోమన్ విభాగాలలో పదేసిమంది వస్తాదుల బృందంతో భారత్ బరిలోకి దిగినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది.

పురుషుల ఫ్రీ-స్టయిల్ కుస్తీ 57 కిలోల విభాగంలో భారత వస్తాదు ఉదిత్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 70 కిలోలు, 97 కిలోల విభాగాలలో భారత రెజ్లర్లు అభిమన్యు, విక్కీ కాంస్య పతకాలకే పరిమితమయ్యారు.

మహిళల విభాగం 68 కిలోల తరగతిలో 23 సంవత్సరాల రాధిక రజత, 50 కిలోల తరగతిలో శివానీ పవార్ కాంస్య పతకాలు గెలుచుకొన్నారు. మహిళల 53, 72 కిలోల విభాగాలలో అంజు, హర్షిత రజత పతకాలు సాధించారు.

62 కిలోల విభాగంలో మనీషా, 65 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్ కాంస్య పతకాలతో సరిపెట్టుకొన్నారు.మహిళల 57 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్లోనే సరితా మోర్ పరాజయం పొందడంతో భారత్ కు పతకం దక్కకుండా పోయింది.

అమ్మాన్ వేదికగా ముగిసిన గత ఆసియా కుస్తీ పోటీలలో ఓ స్వర్ణంతో సహా మొత్తం 14 పతకాలు సాధించిన భారతజట్టు..ప్రస్తుత 2024 టోర్నీలో కనీసం ఒక్క స్వర్ణమూ నెగ్గక పోగా..9 పతకాలతో పోటీని ముగించాల్సి వచ్చింది.

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి భారత్ తరపున అంతిమ్ పంగల్ మాత్రమే అర్హత సాధించడం విశేషం. 2023 ప్రపంచ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించడం ద్వారా అంతిమ్ పంగల్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగింది.

Tags:    
Advertisement

Similar News