ఉత్కంఠ పోరులో భారత్‌ గెలుపు

జట్టును విజయ తీరాలకు చేర్చిన తిలక్‌ వర్మ

Advertisement
Update:2025-01-25 22:51 IST

చెన్నై వేదికగా జరిగిన భారత్‌, ఇంగ్లండ్‌ రెండో టీ20 అభిమానులకు పండుగ చేసింది. ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం సాధించింది. తిలక్‌ వర్మ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా ఏమాత్రం ధైర్యం చెడకుండా క్రీజులో నిలదొక్కుకున్నాడు. చివరలో రవి బిష్ణోయ్‌ సహకారంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. ఐదు టీ 20ల సిరీస్‌ లో ఇండియా 2-0తో ఆదిక్యంలో ఉంది. మొదట టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 166 పరుగుల టార్గెట్‌ చేదించేందుకు బ్యాటింగ్‌ కు దిగిన ఇండియా రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ వికెట్ కోల్పోయింది. కాసేపటికే సంజూ శాంసన్‌ కూడా ఔట్‌ అయ్యాడు. ఫస్ట్‌ డౌన్‌ లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌ వర్మ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. 55 బంతులు ఎదుర్కొన్న వర్మ నాలుగు ఫోర్లు ఐదు సిక్సులతో 72 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ 26 పరుగులతో ఆకట్టుకున్నాడు. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ లో తిలక్‌ వర్మ వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో గెలుపుపై నమ్మకం పెరిగింది. ఆ వెంటనే ఆర్షదీప్‌ ఔట్‌ అవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో రవి బిష్ణోయ్‌ ఐదు బంతుల్లో రెండు ఫోర్లతో 9 పరుగులు చేసి తిలక్‌ వర్మకు అండగా నిలిచాడు. ఇండియన్‌ బ్యాట్స్‌మన్లలో అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ 12 చొప్పున పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కర్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చాడు. ఆర్చర్‌, ఉడ్‌, రషీద్‌, ఓవర్టన్‌, లివింగ్‌ స్టోన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Tags:    
Advertisement

Similar News