భారత్ కు 41 ఏళ్ల తర్వాత ఏషియాడ్ సింగిల్స్ పతకం!
ఆసియాక్రీడల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు 41 సంవత్సరాల విరామం తర్వాత పతకం దక్కింది. ఈ ఘనతను భారత టాప్ ర్యాంక్ ప్లేయర్ ప్రణయ్ సాధించాడు.
ఆసియాక్రీడల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు 41 సంవత్సరాల విరామం తర్వాత పతకం దక్కింది. ఈ ఘనతను భారత టాప్ ర్యాంక్ ప్లేయర్ ప్రణయ్ సాధించాడు....
భారత స్టార్ ప్లేయర్ ప్రణయ్ ..హాంగ్జు ఆసియాక్రీడల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో రికార్డు పతకం సాధించాడు. 1982 న్యూఢిల్లీ ఆసియాక్రీడల్లో సయ్యద్ మోడీ కాంస్య పతకం నెగ్గిన తర్వాత పురుషుల సింగిల్స్ లో మరో పతకం కోసం భారత్ 41 సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది.
గాయంతోనే ప్రణయ్ పోరాటం...
ప్రపంచ 7వ ర్యాంక్ ప్లేయర్ గా ఉన్న ప్రణయ్ వెన్నెముక గాయంతోనే సింగిల్స్ పోరులో పాల్గొన్నాడు. అంతకు ముందు హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్స్ లో మలేసియా ఆటగాడు లీ జి జియాను 21-16, 21-23, 22-20తో కంగు తినిపించిన ప్రణయ్..సెమీఫైనల్లో మాత్రం పూర్తి ఫిట్ నెస్ తో పాల్గొనలేకపోయాడు.
తీవ్రమైన అలసటతోనే సెమీఫైనల్స్ బరిలోకి దిగిన ప్రణయ్ ను చైనాకు చెందిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ లీ షీ ఫెంగ్ వరుస సెట్లలో ఓడించడం ద్వారా ఫైనల్ కు చేరుకోగలిగాడు.
లీ షీ ఫెంగ్ 21-16, 21-9తో ప్రణయ్ ను 51 నిముషాలలోనే ఓడించాడు. దీంతో ప్రణయ్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతవారం టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన ప్రణయ్ కు వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం దక్కింది.
మొత్తం మీద 19వ ఆసియాక్రీడల్లో ప్రణయ్ 2 పతకాలు సాధించినట్లయ్యింది. 31 సంవత్సరాల ప్రణయ్ కెరియర్ లో ఇదో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచిపోతుంది.
మహిళల సింగిల్స్ లో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ ఓటమితోనే ఆసియాక్రీడల నుంచి నిష్క్ర్రమించాల్సి వచ్చింది.
పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్...
భారతజోడీ సాత్విక్- చిరాగ్ ఆసియాక్రీడల పురుషుల డబుల్స్ ఫైనల్స్ చేరడం ద్వారా అరుదైన ఘనత సొంతం చేసుకొన్నారు. ఆసియాక్రీడల పురుషుల డబుల్స్ గోల్డ్ మెడల్ రౌండ్ చేరిన భారత తొలిజోడీగా రికార్డుల్లో చేరారు.
మలేసియాజోడీ ఆరోన్ చియా- సో వూ ఇక్ తో జరిగిన సెమీస్ పోరులో ప్రపంచ 3వ ర్యాంక్ సాత్విక్- చిరాగ్ కేవలం 46 నిముషాలలోనే 21-17, 21-12తో విజయం సాధించారు.
బంగారు పతకం కోసం జరిగే పోరులో కొరియా జోడీ చోయ్ సోల్- కిమ్ వన్ హో తో శనివారం తలపడనున్నారు. కొరియాజోడీ తో ఇప్పటి వరకూ తలపడిన రెండుకు రెండుసార్లు సాత్విక్- చిరాగ్ జోడీనే విజేతలుగా నిలిచారు.
ప్రస్తుత ఆసియాక్రీడల స్వర్ణపతకం పోరులో సైతం భారతజోడీనే హాట్ ఫేవరెట్లుగా పోటీకి దిగనున్నారు.