అంతర్జాతీయ క్రికెట్ కు 'కంగారూ స్టార్' గుడ్ బై!

ఆస్ట్ర్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీ-20 ప్రపంచకప్ లో భారత్ చేతిలో ఓటమితో వార్నర్ సుదీర్ఘ కెరియర్ కు తెరపడింది.

Advertisement
Update: 2024-06-26 07:41 GMT

ఆస్ట్ర్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీ-20 ప్రపంచకప్ లో భారత్ చేతిలో ఓటమితో వార్నర్ సుదీర్ఘ కెరియర్ కు తెరపడింది.

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్ -8 రౌండ్లోనే ఆస్ట్ర్రేలియా ఇంటిదారి పట్టడంతో దిగ్గజ ఓపెనర్, త్రీ-ఇన్-వన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రెండుదశాబ్దాల క్రికెట్ ఇన్నింగ్స్ ముగిసింది.

భారత్ చేతిలో ఆస్ట్ర్రేలియా 24 పరుగుల తేడాతో ఓటమి పొందటం ద్వారా టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేట నుంచి నిష్క్ర్రమించింది. ప్రపంచకప్ టైటిల్ రేస్ నుంచి ఆస్ట్ర్రేలియా నిష్క్ర్రమణతో..వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరియర్ సైతం ముగిసినట్లయ్యింది.

త్రీ-ఇన్-వన్ ఓపెనర్ వార్నర్...

ప్రపంచ క్రికెట్ కు ఆస్ట్ర్రేలియా అందించిన గొప్ప ఓపెనర్లలో ఒకడుగా డేవిడ్ వార్నర్ కు పేరుంది. గత రెండుదశాబ్దాలుగా..సాంప్రదాయ టెస్టు, ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో కంగారూ బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచిన వార్నర్ ..గతేడాది భారత గడ్డపై జరిగిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ నెగ్గడం ద్వారా వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

అంతేకాదు..ప్రస్తుత ఐసీసీ- టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ కానున్నట్లు వార్నర్ ప్రకటించాడు. తన కెరియర్ లో ఆఖరి టోర్నీ 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మాత్రమేనని స్పష్టం చేశాడు.

2024 టెస్టు సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ పై తన చివరి టెస్టుమ్యాచ్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ ఇప్పుడు టీ-20 క్రికెట్ నుంచి కూడా విరమించుకోడంతో..

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోడం పరిపూర్ణమయ్యింది.

110 మ్యాచ్ ల్లో 3277 పరుగులు...

టీ-20 క్రికెట్లో దక్షిణాఫ్రికా పై తన అరంగేట్రం మ్యాచ్ లోనే కేవలం 43 బంతుల్లోనే 89 పరుగులు సాధించడం ద్వారా సత్తా చాటుకొన్న వార్నర్ కు 110 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో 3277 పరుగులు సాధించిన ఘనమైన రికార్డు ఉంది. ఓ సెంచరీ, 28 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. 2019లో పాకిస్థాన్ పై టీ-20 శతకం సైతం వార్నర్ నమోదు చేశాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన ఆస్ట్ర్రేలియా మూడో క్రికెటర్ గానూ వార్నర్ కు అరుదైన రికార్డు ఉంది.

టీ-20ల్లో 10వేల పరుగుల మొనగాడు...

టీ-20 ఫార్మాట్లో 10వేలకు పైగా పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్ గా రికార్డుల్లో చేరిన వార్నర్ కు..ఐపీఎల్ లో రికార్డుల మోత మోగించిన ఘనత ఉంది. హైదరాబాద్ సన్ రైజర్స్ కు కెప్టెన్ గా ఐపీఎల్ ట్రోఫీ అందించిన ఘనత సైతం వార్నర్ కు మాత్రమే సొంతం.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకొన్నా టీ-20 లీగ్ క్రికెట్ లో మాత్రం తాను కొనసాగుతానని తెలిపాడు. ఆస్ట్ర్రేలియన్ బిగ్ బాష్ లీగ్ తో పాటు..ఐపీఎల్ లో సైతం వార్నర్ పాల్గోనున్నాడు.

వార్నర్ రిటైర్మెంట్ తో ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ లో ఓ గొప్పఓపెనర్ శకం ముగిసిందని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు.

Tags:    
Advertisement

Similar News