ప్రపంచ ర్యాంకింగ్స్ శిఖరాగ్రాన భారతజోడీ!

భారత బ్యాడ్మింటన్ సూపర్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ శిఖరాగ్రాన నిలిచారు.

Advertisement
Update:2023-10-11 08:27 IST

భారత బ్యాడ్మింటన్ సూపర్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ శిఖరాగ్రాన నిలిచారు...

ప్రపంచ బ్యాడింటన్ పురుషుల డబుల్స్ లో గత రెండేళ్లుగా సంచలన విజయాలతో నిలకడగా రాణిస్తున్న భారత సూపర్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్ పురుషుల డబుల్స్ లో అగ్రభాగాన నిలిచారు.

హాంగ్జు వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన 19వ ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించడం ద్వారా 3వ ర్యాంక్ నుంచి నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోగలిగారు.

అంచెలంచెలుగా....

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారతజోడీ టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకొన్నారు. ఈ ఘనత సాధించిన భారత తొలి డబుల్స్ జంటగా రికార్డు నెలకొల్పారు.

గతంలో పురుషుల సింగిల్స్ లో ప్రకాశ్ పడుకోన్, కిడాంబీ శ్రీకాంత్, మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ మాత్రమే నంబర్ వన్ ర్యాంక్ ను అందుకోగలిగారు. ఆ తరువాత సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ మాత్రమే ఈ ఘనత సాధించగలిగారు.

ఆసియాక్రీడల పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్లో దక్షిణ కొరియా జోడీ చోయ్ సోల్ గుయ్- కిమ్ వాన్ హోలను 21-18, 21-16తో ఓడించడం ద్వారా సాత్విక్- చిరాగ్ జోడీ భారత్ కు తొలి బంగారు పతకం అందించిన కొద్దిరోజుల వ్యవధిలోనే నంబర్ వన్ ర్యాంకర్లుగా నిలువగలిగారు.

2022 నుంచి టాప్ గేర్ లో....

ఆసియాక్రీడల పురుషుల టీమ్ విభాగంలో భారత్ రజత పతకం గెలచుకోడంలో సాత్విక్- చిరాగ్ జోడీ తమవంతు పాత్ర నిర్వర్తించారు. దానికి అదనంగా పురుషుల డబుల్స్ లో సైతం బంగారు పతకం సాధించగలిగారు.

ఆసియాక్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ తొలిసారిగా మూడు విభాగాలలో మూడు పతకాలు అందుకోడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ కాంస్య పతకం సాధించాడు. గత నాలుగు దశాబ్దాల కాలంలో భారత బ్యాడ్మింటన్ జట్టు ఆసియాక్రీడల్లో మూడు పతకాలు గెలుచుకోడం ఇదే మొదటిసారి.

2022 ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ టైటిల్ నెగ్గిన తరువాత సాత్విక్- చిరాగ్ జోడీ మరి వెనుదిరిగి చూసింది లేదు. గతేడాది జనవరి లో జరిగిన ఇండియన్ ఓపెన్ ఫైనల్లో

ఇండోనీసియాజోడీ మహ్మద్ అహసాన్- హెండ్రా సెత్యావాన్ లను 21-16, 26-24 చిత్తు చేసిన తరువాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ లోనూ భారతజోడీకి ఎదురేలేకపోయింది.

2023 సీజన్లో స్విస్ ఓపెన్, ఇండోనీషియన్ ఓపెన్, కొరియన్ ఓపెన్ టైటిల్స్ సైతం భారతజంటకు దాసోహమన్నాయి. ఇండోనీషియన్ ఓపెన్ టైటిల్ సమరంలో ప్రపంచ రెండోర్యాంక్ జంట ఆరోన్ చియా- వూ ఇక్ సోలను 21-17, 21-18తో కంగు తినిపించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటి చెప్పారు.

థామస్ కప్ విజయంలోనూ..

1949 నుంచి జరుగుతున్న థామస్ కప్ టోర్నీలోనూ భారతజట్టు తొలిసారిగా బంగారు పతకం అందుకోడంలో సాత్విక్- చిరాగ్ జోడీ కీలకపాత్ర పోషించారు. ఫైనల్లో ఇండోనీషియాను చిత్తు చేయడంలో ప్రధానపాత్ర వహించారు. థామస్ కప్ చరిత్రలోనే 14సార్లు చాంపియన్ గా నిలిచిన ఇండోనీషియాను భారత్ 3-0తో చిత్తు చేయడం ద్వారా తొలిసారిగా ట్రోఫీ అందుకోగలిగింది.

గత ఏడాది బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో బ్రిటీష్ జోడీ బెన్ లాన్- సీన్ వార్డీలను చిత్తు చేయడం ద్వారా బంగారు పతకం సాధించారు. మిక్సిడ్ టీమ్ విభాగంలోనూ భారత్ కు రజత పతకం అందించారు.

ఆ తర్వాత దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ డబుల్స్ లో కాంస్య పతకం సాధించారు.

2023 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టైటి్ల్ సమరంలోనూ మలేసియాజోడీ ఆంగ్ ఇ సిన్ -తే ఇ పై 16-21, 21-17, 21-19తో అధిగమించడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలిజంటగా చరిత్ర సృష్టించారు.

వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ లో సైతం సాత్విక్- చిరాగ్ జోడీ భారత్ కు బంగారు పతకం అందించే అవకాశాలు లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News