యూజర్‌ ఫ్రెండ్లీ యూట్యూబ్‌

కొత్త ఫీచర్లు తీసుకువచ్చిన వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌

Advertisement
Update:2024-10-16 15:00 IST

ప్రముఖ వీడియో స్ట్రిమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ యూజర్లను ఆకర్షించడానికి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్‌ టైమర్‌, రిసైజబుల్‌ మినీ ప్లేయర్‌, ఫేవరేట్‌ ప్లే లిస్ట్‌.. ఇలా అనేక ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ తన బ్లాగ్ లో పోస్ట్‌ చేసింది. కొత్త ఫీచర్లు ఎలా పనిచేస్తాయో అందులో వివరించింది.

సరికొత్త ఫీచర్‌ స్లీప్‌ టైమర్‌

చాలామంది యూట్యూబ్‌లో వీడియోలు చూస్తేనే నిద్రపోతుంటారు. వీడియోలు ప్లే అవుతున్నా ఆఫ్‌ చేయలేని పరిస్థితి. ఈ సమస్యకు యూట్యూబ్‌ చెక్‌ పెట్టింది. దీనికోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే స్లీప్‌ టైమర్‌. దీని సాయంతో టైమర్‌ను సెట్‌ చేసుకుని వీడియోలు ప్లే చేయవచ్చు. మనం సెట్‌ చేసుకున్న టైం ముగియగానే వీడియో ఆఫ్‌ చేయడం మరిచిపోయినా, నిద్రపోయినా ఆటోమెటిక్‌గా వీడియో ఆగిపోతుంది. వీడియో ప్లే చేసిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్‌ ఐకాన్‌ను ట్యాప్‌ చేయగానే ‘Sleep Timer’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీకు కావాల్సిన టైమ్‌ సెట్‌ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీమియం యూజర్లకే పరిమితమైన ఈ ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

ప్లే లిస్ట్‌ కు థంబ్‌నైల్స్‌

ప్లే లిస్ట్‌ క్రియేట్‌ చేసుకునే సౌకర్యాన్ని యూట్యూబ్‌ ఇప్పటికే అందిస్తున్నది. వాటిని క్యూ ఆర్‌ కోడ్‌ సాయంతో నచ్చిన వ్యక్తులకు పంపే సదుపాయాన్ని కొత్తగా తీసుకొచ్చింది. అంతేకాదు ఆ లిస్ట్‌కు నచ్చిన థంబ్‌నైల్స్‌ను ఏఐ సహాయంతో రూపొందించవచ్చు. కావాలంటే మీ ఫొటోలను కూడా పెట్టుకోవచ్చని తెలిపింది.

నచ్చిన చోటుకు మినీ ప్లేయర్‌

మల్టీ టాస్కింగ్‌లో భాగంగా మినీ ప్లేయర్‌లో కొత్త సౌకర్యాలను యూట్యూబ్‌ జోడించింది. సాధారణంగా యూట్యూబ్‌లో మినీ ప్లేయర్‌ కుడివైపు కింది భాగంలో కనిపిస్తుంది. దాన్ని ఏవైపు కదిలించకుండా మన పని మనం చేసుకోవచ్చు. అయితే ఇకపై మీ మినీ ప్లేయర్‌ను మీకు నచ్చిన చోటుకు మార్చుకోవచ్చు. అంతేకాదు కావావలంటే సైజ్‌ను పెంచుకునే, లేదా తగ్గించుకునే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ల కోసం బ్యాడ్జ్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. వీటిలో కొన్ని ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరికొన్ని ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వీడియో ప్లాట్‌ఫామ్‌ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News