నేడు నేవీలోకి మూడు అధునాతన యుద్ధనౌకలు
జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్రమోడీ నేడు (బుధవారం) మహారాష్ట్రలో పర్యటించనున్నారు. అధునాతన యుద్ధనౌకలు.. ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయున్నారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈకార్యక్రమం జరగనున్నది. ఈ యుద్ధనౌకల రాకతో నేవీ బలం పెరుగుతుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా భారత్‌కు ఇది పెద్ద ముందడుగు అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకునేలా ఆయన ఖార్ఘర్‌లో ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయాన్ని కూడా ప్రారంభిస్తారు.
ఐఎన్‌ఎస్ సూరత్..పీ15 బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధనౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధనౌకల్లో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధనౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్ వ్యవస్థలున్నాయి. నెట్‌వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం. ఐఎన్‌ఎస్ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు. ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్.. పీ75 కింద రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.