అంతరిక్షంలో స్పేడెక్స్‌ డాకింగ్‌ సక్సెస్‌

నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో

Advertisement
Update:2025-01-16 11:01 IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్‌ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో గురువారం 'ఎక్స్‌' వేదికగా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది.

గత డిసెంబర్‌ 30న తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ60(పీఎస్‌ఎల్‌వీ) లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఏ రాకెట్‌ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్‌ కోసం మూడుసార్లు యత్నించగా.. పలు కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది.

చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్‌ చేసి డాకింగ్‌ ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్టులో రాసుకొచ్చింది. దీనికి శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్‌ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్‌ కూడా వాటి సరసన చేరింది. 

Tags:    
Advertisement

Similar News