భూమి ఎలా తిరుగుతున్నదో చూశారా?
నెట్టింట వైరల్‌గా మారిన భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు
భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్టే అంగ్‌చుక్ లద్దాఖలో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్-ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న అంగ్‌చుక్.. 24 గంటల పాటు టైమ్‌లాప్స్‌ను ఉపయోగించి వీడియో తీశారు. ఈ మొత్తాన్ని ఒక నిమిషం వీడియోగా క్రోడీకరించారు. ఇందులో భూమి ఎలా భ్రమిస్తున్నదో స్పష్టంగా కనిపిస్తున్నది. అంగ్‌చుక్ మాట్లాడుతూ.. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే, భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని.. వీడియోలో బంధించడానికి చాలా ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు.
భూ భ్రమణం గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. లద్దాఖ్‌లో విపరీతమైన శీతల పరిస్థితులు ఉండటం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్ పనిచేయకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగిలాయని.. కానీ ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లానని అన్నారు.