ఐఫోన్ల ఉత్పత్తి 30 శాతం డౌన్.. కారణం ఏంటంటే..?
చాలామంది కంపెనీ నుంచి పారిపోయారు. దీంతో అటోమేటిక్‌గా ఉత్పత్తి తగ్గిపోయింది. వచ్చే నెల నుంచి దీని ప్రభావం కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలపై కనపడుతుంది.
ఐఫోన్ ఆర్డర్ ఇస్తే ఇకపై వెంటనే రాకపోవచ్చు, ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఐఫోన్ల కోసం ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిందే. ఐఫోన్ల తయారీ దాదాపు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు ఆ మేరకు వేచి చూడాల్సిందేనని కంపెనీ వర్గాలంటున్నాయి. ఇంతకీ ఐఫోన్ల ఉత్పత్తి ఎందుకు తగ్గుతోంది.
ఐఫోన్ తయారీ కోసం ఆ కంపెనీతో ఒప్పందం ఉన్న అతిపెద్ద ఫ్యాక్టరీ చైనాలో ఉంది. ఐఫోన్‌తోపాటు అమెరికాకు చెందిన చాలా కంపెనీల ఉత్పత్తులు ఫాక్స్ కాన్ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. అయితే ఇప్పుడు కొవిడ్ కారణంగా చైనాలో నిబంధనలు కఠినతరం చేశారు. ఉద్యోగుల్ని కంపెనీలోనే బంధించారు. వారితో బలవంతంగా పని చేయించుకోవాలని చూశారు. దీంతో చాలామంది కంపెనీ నుంచి పారిపోయారు. దీంతో అటోమేటిక్‌గా ఉత్పత్తి తగ్గిపోయింది. వచ్చే నెల నుంచి దీని ప్రభావం కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలపై కనపడుతుంది.
ఈ లోటును భర్తీ చేయడానికి షెన్జెన్ నగరంలోని మరొక ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పెంచడానికి కృషి చేస్తున్నా అది సాధ్యపడటం లేదు. డిమాండ్‌కి తగ్గట్టు సప్లయి ఉండదని తెలుస్తోంది. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు ఫాక్స్ కాన్ కంపెనీలు పనిచేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది ప్రస్తుతం విధులకు హాజరు కావడంలేదు. చైనాలో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నా.. ఫాక్స్ కాన్‌లో మాత్రం అక్కడే ఉద్యోగులకు బస ఏర్పాటు ఉంది. అయితే క్వారంటైన్లో ఉంటూ విధులు నిర్వహించడం ఉద్యోగులకు ఇష్టం లేదు. అందుకే చాలా మంది పారిపోయారు. మిగతావారితో పనిజరుగుతోంది. ఉత్పత్తి భారీ స్థాయిలో పడిపోవడంతో ఐఫోన్లకు కరువొచ్చేలా ఉంది.