Google Pixel 8 | శాంసంగ్.. ఆపిల్ బాటలో గూగుల్.. భారత్‌లోనే గూగుల్ పిక్సెల్8 ఫోన్ల ఉత్పత్తి..!
Google Pixel 8 | భారత్‌పై గ్లోబల్ టెక్ మేజర్ గూగుల్ కీలక నిర్ణయం ప్రకటించింది. తమకు భారత్ ప్రాధాన్య మార్కెట్ అని పేర్కొంది. తమ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్లు భారత్‌లోనే తయారు చేస్తామని గురువారం తెలిపింది.
Google Pixel 8 | భారత్‌పై గ్లోబల్ టెక్ మేజర్ గూగుల్ కీలక నిర్ణయం ప్రకటించింది. తమకు భారత్ ప్రాధాన్య మార్కెట్ అని పేర్కొంది. తమ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ ఫోన్లు భారత్‌లోనే తయారు చేస్తామని గురువారం తెలిపింది. మేకిన్ ఇండియా ఇన్సియేటివ్‌లో భాగంగా భారత్‌లో 2024 నుంచి పిక్సెల్ 8 ఫోన్ల తయారీ ప్రారంభిస్తామని వెల్లడించింది.
పిక్సెల్‌కు భారత్ ప్రియారిటీ మార్కెట్ అని #గూగుల్ ఫర్ ఇండియా (#GoogleForIndia)లో గూగుల్ డివైజెస్ అండ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్‌లోహ్ (Rick Osterloh) తెలిపారు. భారత్ మార్కెట్‌లో పిక్సెల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్, గిరాకీని అందుకునేందుకు మా ఉత్పత్తుల ప్రొడక్షన్ కెపాసిటీ విస్తరణ దిశగా ఇది తొలి అడుగు అని రిక్ ఓస్టర్ లోహ్ చెప్పారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.
`దేశీయంగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నామని గూగుల్ ఫర్ ఇండియా (GoogleForIndia)వద్ద మా ప్రణాళికలు వెల్లడిస్తున్నాం. భారత్‌లో డిజిటల్ గ్రోత్‌కు విశ్వసనీయ భాగస్వామిగా మేం ఉండాలని భావిస్తున్నాం. మేకిన్ ఇండియాకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాం అని గూగుల్ అండ్ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. తద్వారా ఆపిల్ వంటి ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీల బాటలో గూగుల్ ప్రయాణించనున్నది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్, చైనాకు చెందిన షియోమీ కూడా భారత్‌లోనే తమ ఉత్పత్తులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నెల ప్రారంభంలోనే గూగుల్.. తన పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ప్రీమియం ఫోన్లను భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. గూగుల్ టెన్సర్ జీ3 చిప్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ పని చేస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ ఒక చార్జింగ్ చేస్తే 72 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ రూ.75,999 లకు లభిస్తుంది. దేశీయ మార్కెట్‌లో తయారు చేస్తే ఎంత ధర నిర్ణయిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
గూగుల్ తన తొలి పిక్సెల్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఆవిష్కరించిన ఏడేండ్లకు.. భారత్‌లో తన స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తామని ప్రకటించడం ఆసక్తికర పరిణామం. భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ల అసెంబ్లింగ్ కోసం స్థానిక, విదేశీ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదర్చుకోనున్నట్లు గూగుల్ తెలిపింది.
పిక్సెల్ 8 సహా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి భారత్‌లో వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. భారత్‌లోని 27 నగరాల పరిధిలో ఎఫ్1 ఇన్‌ఫో సొల్యూషన్స్ (F1 Info Solutions) ఆధ్వర్యంలో గూగుల్ తన సర్వీస్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఈ సర్వీస్ నెట్‌వర్క్ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.