ఈ సీజన్‌లో కళ్ల‌లోకి కళ్లు పెట్టి చూడద్దు… ఎందుకో తెలుసా..?

ఇది వస్తే కండ్లు ఎర్రబారడం, నీరు కారడం, రాత్రి నిద్రపోయే సమయాల్లో కంటి రెప్పలు అంటుకుపోవటం, పుసులు కట్టడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Advertisement
Update:2023-08-01 15:22 IST

`కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు`.. అని పాట పాడుకొనే కాలం కాదిది. ఇలా చూస్తే అలా అంటుకుపోయే కళ్లకలక సీజన్ ఇది. పేరుకు రొమాంటిక్ గా పింక్ ఐ అని పిలుచుకునే ఈ సమస్య మన కళ్ల‌ని కట్టి పడేస్తుంది. మంట పుట్టిస్తుంది..

ఆడ, మగ, చిన్న, పెద్ద, ఊరు, పేరు, దేనితోని సంబంధం లేకుండా వర్షాకాలంలో వచ్చే ఈ కండ్ల కలక అందరినీ ఇబ్బంది పెడుతుంది. నిజానికి ఇదేమి పెద్ద సమస్య కాదు కానీ వచ్చిందంటే రెండు, మూడు రోజులు పాటు వేరే ఏ పని తోచినివ్వదు. ఈ సీజన్ లో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా బ్యాక్టీరియా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. కళ్ల‌ కలకకు కారణం అవుతుంది.

కంటిలో ఉండే తెల్లభాగం కనురెప్పల ఉపరితలం కంజుంక్టివా (conjunctiva) అనే సన్న పొరతో కప్పబడి ఉంటుంది. ఇది కంటిని రక్షణ కవచంలా కాపాడుతుంది. కన్నీరు జిగురు ద్రవం ఉత్పత్తి చేసి కన్ను తడిగా ఉండటానికి తోడ్పడుతుంది. చూపు బాగుండటానికి ఇది చాలా ముఖ్యం. ఈ పొర ఉబ్బడాన్నే కళ్ల‌ కలక అంటారు.

ఇది వస్తే కండ్లు ఎర్రబారడం, నీరు కారడం, రాత్రి నిద్రపోయే సమయాల్లో కంటి రెప్పలు అంటుకుపోవటం, పుసులు కట్టడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మందులు వాడకపోయినప్పటికీ ఈ సమస్య వారం రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. అయితే కొందరిలో మాత్రం ఇది తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. అందరికీ వారం రోజుల్లో తగ్గిపోతే, కొందరికి మూడు నాలుగు వారాలు వరకు వేధించవచ్చు. ఇంకొందరికి శాశ్వతంగా ఉండిపోయే అవకాశం ఉంది. అందువలన కళ్ల‌ కలక తగ్గకపోతే వెంటనే కంటి డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.

కళ్ల కలక ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంది కాబట్టి కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ అంటుకోవచ్చు. అందుకే కళ్ల‌కలక వచ్చిన వారు ఇతరులతో కలవకుండా కాస్త దూరంగా ఉండాలి. నల్ల కళ్లద్దాలు ధరించాలి. దీంతో కళ్ళకు ఎక్కువ వెలుతురు తగిలి ఇబ్బంది పెట్టదు, అలాగే చేతులతో కళ్ల‌ను నలపడం తగ్గుతుంది. చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తమ దుప్పటి, ట‌వ‌ల్‌ వంటి వాడిని విడిగా పెట్టుకోవాలి. ఫోన్ వంటి పరికరాలను కూడా వీలైనంతవరకు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండటం మంచిది. సాధారణంగా ఈ వైరస్ ఒక కంటికి మాత్రమే వస్తుంది. దాన్ని తాకిన చేతితో మరో కంటిని తాకకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు

నిజానికి కళ్ల‌ కలకకు ప్రత్యేకమైన మందులు ఏమీ లేవు. తరచూ కళ్ల‌ను శుభ్రం చేసుకోవడం, తాత్కాలిక ఉపశమనం కోసం లూబ్రికెంట్స్ ని వాడటం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తలెత్తకుండా యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడటం త్వరగా తగ్గడానికి సహాయ పడుతుంది. కానీ, ఇది వారాల తరబడి వేధిస్తే కంటి డాక్టర్ సంప్రదించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News