రైల్వే ప్రయాణికులకు తీపి కబురు

పేమెంట్‌ పూర్తవ్వగానే టికెట్‌ అందిస్తారని పేర్కొంది. సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన నగదు రహిత చెల్లింపు సదుపాయాన్ని జోన్‌ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకూ విస్తరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

Advertisement
Update:2024-08-14 23:09 IST

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. టికెట్‌ కౌంటర్ల వద్ద టికెట్ల కొనుగోలులో చిల్లర కష్టాలు ఇకపై తీరనున్నాయి. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపుల సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తేవడంతో ప్రయాణికులకు ఇకపై టికెట్‌ కౌంటర్ల వద్ద టికెట్ల కొనుగోలు సులభతరం కానుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ విషయాన్ని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇప్పుడు అన్ని స్టేషన్లకూ దీనిని విస్తరించామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్, రిజర్వేషన్‌ కౌంటర్లలో క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్‌ చెల్లింపులు చేయొచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్‌ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నామని తెలిపారు.

ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్‌లో ఎంటర్‌ చేసిన తర్వాత ఆ డివైజ్‌లో క్యూఆర్‌ కోడ్‌ ప్రత్యక్షమవుతుందని, యూపీఐ యాప్‌లు వినియోగించి చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. పేమెంట్‌ పూర్తవ్వగానే టికెట్‌ అందిస్తారని పేర్కొంది. సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన నగదు రహిత చెల్లింపు సదుపాయాన్ని జోన్‌ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకూ విస్తరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే అన్ని స్టేషన్లకూ డివైజ్‌లను పంపించామని, దశలవారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన కమర్షియల్, టెక్నికల్‌ సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ కొనియాడారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

Tags:    
Advertisement

Similar News