రీల్స్ చేయొద్దన్నందుకు భర్తను చంపిన‌ భార్య

రీల్స్ పిచ్చిలో పడిన ఓ గృహిణి.. వీడియోలు చేయొద్దన్నందుకు భర్తనే చంపేసింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.

Advertisement
Update:2024-01-08 16:06 IST

అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి జనానికి సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ సొంత గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. మోజ్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, స్నాప్ చాట్ వంటి యాప్ లలో రీల్స్, షాట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి సరదాగా వీడియోలు తీసుకుంటే పర్లేదు కానీ, కొందరు వీటికి అల‌వాటుగా మారిపోయారు. ఇంట్లో, పనిచేసే చోట ఎక్కడ చూసినా వీడియోలు చేసుకుంటూ కనిపిస్తున్నారు. కొందరైతే బరితెగించి నడిరోడ్డుపై ట్రాఫిక్ ను ఆపి, మరికొందరు మెట్రో ట్రైన్లలో వీడియోలు తీసుకుంటున్నారు.

ఇలా రీల్స్ పిచ్చిలో పడిన ఓ గృహిణి.. వీడియోలు చేయొద్దన్నందుకు భర్తనే చంపేసింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. సమస్తిపూర్ జిల్లా నర్షన్ గ్రామానికి చెందిన మహేశ్వర్ కు ఖోడాబంద్ పూర్ గ్రామానికి చెందిన రాణి కుమారితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది.

కూలి పనులు చేసుకుని బతికే మహేశ్వర్ పనుల నిమిత్తం కొద్ది నెలల కిందట కోల్‌కత్తాకు వెళ్ళాడు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న రాణి కుమారి స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారింది. ఇన్ స్టా, యూట్యూబ్ లలో రీల్స్, షాట్స్ చేయడం మొదలుపెట్టింది.

ఇటీవల కోల్‌కత్తా నుంచి ఇంటికి వచ్చిన మహేశ్వర్‌కు ఈ విషయం తెలిసింది. ఇకపై వీడియోలు చేయవద్దని భార్య రాణిని హెచ్చరించాడు. దీంతో ఆమె కోపంతో పుట్టింటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. భార్యను ఇంటికి తీసుకువచ్చేందుకు మహేశ్వర్ ఆదివారం అత్తగారింటికి వెళ్లాడు.

అక్కడ కూడా రీల్స్ గురించి ప్రస్తావన రాగా.. మరోసారి వీడియోలు చేయవద్దని మహేశ్వర్ భార్యకు చెప్పాడు. ఈ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన రాణి తల్లిదండ్రులతో కలిసి భర్తను గొంతు నులిమి చంపేసింది. ఆదివారం రాత్రి మహేశ్వర్ సోదరుడు తన అన్నకు ఫోన్ చేయగా.. వేరే వాళ్ళు లిఫ్ట్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సోదరుడి నుంచి రిప్ల‌య్‌ రాకపోవడంతో అనుమానం వచ్చి మహేశ్వర్ కుటుంబ సభ్యులు రాణి గ్రామానికి చేరుకున్నారు.

ఇంటికి వెళ్లి చూడగా మహేశ్వర్ మృతదేహం కనిపించింది. దీంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రాణిని అదుపులోకి తీసుకొని విచారించగా.. రీల్స్ చేయవద్దని చెప్పినందుకే భర్తను హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. 

Tags:    
Advertisement

Similar News