మమతా బెనర్జీ ఐక్యతా రాగం..! - విపక్షాల ఐక్యతపై తొలిసారి బహిరంగంగా వెల్లడి
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట తప్పకుండా పోరాడాలని, అందుకు తాము కూడా మద్దతిస్తామని చెప్పిన మమతా.. తమ మద్దతు కావాలంటే కాంగ్రెస్ కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విపక్షాల ఐక్యతపై సోమవారం కోల్‌కతా సెక్రటేరియట్‌లో బహిరంగ ప్రకటన చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అవసరమైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట ఆ పార్టీకి మద్దతివ్వడానికి రెడీ అని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం కోసం అవసరమైతే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతిస్తామని దీదీ స్పష్టం చేశారు.
2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్షాల ఐక్యత కోసం కృషిచేస్తున్న పలు పార్టీలు కాంగ్రెస్ పార్టీని మాత్రం పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. మరోపక్క తమ మద్దతు లేకుండా అది అసాధ్యమని కాంగ్రెస్ కూడా ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వివిధ పార్టీల ఆలోచనలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా దీదీ కాంగ్రెస్‌కి మద్దతిచ్చేందుకు తాము సిద్ధమేనని ప్రకటించడం అందులో భాగమేనని భావించవచ్చు.
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట తప్పకుండా పోరాడాలని, అందుకు తాము కూడా మద్దతిస్తామని చెప్పిన మమతా.. తమ మద్దతు కావాలంటే కాంగ్రెస్ కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట బీజేపీ పోరాడలేదనే విషయం కర్నాటక ఎన్నికలతో స్పష్టమైందని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉందని, అలాగే ఢిల్లీలో ఆప్ బలంగా ఉందని, తమిళనాడులో డీఎంకేతో.. బీహార్‌లో నితీశ్, తేజస్వితో.. జార్ఖండ్‌లో జేఎంఎంతో కాంగ్రెస్ స్నేహపూర్వక బంధాలే కలిగి ఉందని మమతా చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట వాటికి మద్దతివ్వాలని తెలిపారు. తమ అంచనాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 200 స్థానాల్లో బలంగా ఉందని.. అక్కడ తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు.
దీదీ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. విపక్షాల ఐక్యతకు కృషిచేస్తున్న మిగిలిన పార్టీలు కూడా మమతా బెనర్జీ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తాయన్నది వేచిచూడాలి. ఏది ఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.