పఠాన్ మూవీ 'రంగు' రచ్చ: 'జీహాదీ షారూఖ్ ఖాన్ ను సజీవ దహనం చేస్తా... థియేటర్లను తగలబెట్టండి'
అయోధ్య లోని తపస్వి ఛావ్నీకి చెందిన మహంత్ పరమహంస ఆచార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. షారూఖ్ ఖాన్‌ను సజీవ దహనం చేస్తానని ఆయన హెచ్చరించాడు. ‘బేషరం రంగ్’ పాటలో కాషాయ రంగునును అవమానించారని పరమహంస ఆచార్య మండిపడ్డారు.
దేశంలో రంగుల రచ్చ ఆగడం లేదు. పఠాన్ మూవీలో దీపిక పదుకొనే ధరించిన బికినీ కాషాయ రంగులో ఉండటంతో హిందుత్వ వాదులు రచ్చ మొదలు పెట్టారు. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ఆ మూవీ నిర్మాత కాదు, దర్శకుడు కాదు, హీరో షారూఖ్ ఖాన్ వాళ్ళ టర్గెట్.
దీపిక పదుకునే మీద కూడా విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధానంగా షారూఖ్ ఖాన్ పై విరుచుకపడుతున్నారు హిందుత్వ వాదులు. పఠాన్ మూవీ దేశ భక్తి సినిమా అని, చూస్తే కానీ ఆ సినిమా గురించి తెలియదని షారూఖ్ ఖాన్ బహిరంగ ప్రకటన చేసినా నిరసనలు ఆగడం లేదు. చివరకు షారూఖ్ ఖాన్ ను హత్య చేస్తామనే హెచ్చరికలు చేసే దాకా వెళ్ళారు హిందుత్వ వాదులు.
అయోధ్య లోని తపస్వి ఛావ్నీకి చెందిన మహంత్ పరమహంస ఆచార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. షారూఖ్ ఖాన్‌ను సజీవ దహనం చేస్తానని ఆయన హెచ్చరించాడు. 'బేషరం రంగ్' పాటలో కాషాయ రంగునును అవమానించారని పరమహంస ఆచార్య మండిపడ్డారు.
"మన సనాతన ధర్మానికి చెందిన ప్రజలు 'పఠాన్' మూవీకి వ్యతిరేకంగా నిరంతరం నిరసనలు చేస్తున్నారు. ఈరోజు షారుక్ ఖాన్ పోస్టర్‌ను తగులబెట్టాం. నేను జిహాదీ షారుఖ్ ఖాన్‌ను వెతుకుతున్నాను అతను దొరికితే అతనిని సజీవ దహనం చేస్తాను. మరెవరైనా అతన్ని సజీవ దహనం చేస్తే వాళ్ళ కేసును కోర్టులో నేను పోరాడుతాను "అని పరమహంస అన్నాడు.
ఆచార్య అంతటితో ఆగలేదు. 'పఠాన్' సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే వాటిని తగులబెడతామని హెచ్చరించాడు.'పఠాన్'సినిమాను బహిష్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాగా గతంలో ఇదే పరమహంస ఆచార్య , భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించకుంటే 'జల సమాధి' అవుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.
మరో వైపు అయోధ్య లోని హనుమాన్ గర్హి పూజారి మహంత్ రాజు దాస్, పఠాన్ విడుదలయ్యే థియేటర్లను తగలబెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "బాలీవుడ్, హాలీవుడ్ ఎప్పుడూ మన సనాతన మతాన్ని ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీపికా పదుకొణె కాషాయ రంగు బికినీనిగా వాడటం మాకు బాధ కలిగించింది. కాషాయ రంగు బికినీ ధరించాల్సిన అవసరం ఏమిటి? సినిమాను బహిష్కరించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా ప్రదర్శించే థియేటర్లను తగలబెట్టండి. అలా చేస్తే తప్ప మన సత్తా ఏంటో వారికి అర్థం కాదు. చెడును ఎదుర్కోవడానికి మనం మరింత దుర్మార్గంగా ఉండాలి" అని రాజు దాస్ అన్నారు.