బెంగాల్ నవరాత్రులకోసం.. బంగ్లాదేశ్ చేపలు

బెంగాల్ లో కొంతమంది హిల్సా చేపను పూజల్లో నైవేద్యంగా సమర్పిస్తుంటారు. మిగతావారు మాత్రం పూజలకు సంబంధం లేకుండా నవరాత్రుల సందర్భంగా ఈ చేపలను వండుకుని తింటారు.

Advertisement
Update:2023-09-22 09:16 IST

పశ్చిమ బెంగాల్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి చోటా మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలు ఉంచి పూజిస్తారు. ఆ తర్వాత నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతుంది. నవరాత్రుల సందర్భంగా గర్భా నృత్యాలు, పూజలు, సందడి.. ఆ ఉత్సాహం వేరే లెవల్ లో ఉంటుంది. నవరాత్రుల సందర్భంగా బెంగాల్ లో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి అతిథులకు వడ్డిస్తుంటారు. పండగ అంటే మనకు పిండి వంటకాలే, కానీ బెంగాల్ లో నవరాత్రులు అంటే హిల్సా చేప ఉండాల్సిందే. ఈ హిల్సా చేప ప్రత్యేకంగా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ ఏడాది హిల్సా చేపలు పంపించేందుకు బంగ్లాదేశ్ ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. 4వేల మెట్రిక్ టన్నుల హిల్సా చేపలు బంగ్లాదేశ్ నుంచి ఓడల ద్వారా పశ్చిమబెంగాల్ కి వస్తున్నాయి.

కేజీ వెయ్యి రూపాయలు..

మన గోదావరి పులసలాగానే బంగ్లాదేశ్ లో 'పద్మా పులస' బాగా ఫేమస్. ఇక్కడ పులస ఎంత ఖరీదైన వ్యవహారమో అక్కడ 'పద్మాపులస' కూడా ఖరీదు ఎక్కువ. బంగ్లాదేశ్‌ లోని పద్మా నదిలో పుట్టే చేపలు కాబట్టే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. ఇది పశ్చిమబెంగాల్ కి వచ్చే సరికి హిల్సాగా మారిపోతుంది. కోల్ కత మార్కెట్ లో ఈ చేప కేజీ వెయ్యి రూపాయలు ధర పలుకుతుంది. రేటు ఎక్కువగా ఉన్నా కూడా నవరాత్రులలో ఆ రుచి లేకుండా బెంగాల్ ప్రజలకు ముద్ద దిగదు.

పూజలలో నైవేద్యం..

బెంగాల్ లో కొంతమంది హిల్సా చేపను పూజల్లో నైవేద్యంగా సమర్పిస్తుంటారు. మిగతావారు మాత్రం పూజలకు సంబంధం లేకుండా నవరాత్రుల సందర్భంగా ఈ చేపలను వండుకుని తింటారు. మొత్తమ్మీద నవరాత్రుల్లో ఈ చేపకోసం పశ్చిమబెంగాల్ వాసులు ఎదురు చూస్తుంటారు. అయితే బంగ్లాదేశ్ నుంచి సరుకు వస్తేనే బెంగాల్ వాసులకు పండగ. ఈ ఏడాది 4వేల మెట్రిక్ టన్నుల పద్మాపులస, హిల్సాగా మారి బెంగాల్ రేవులకు వస్తోంది.

Tags:    
Advertisement

Similar News