అదానీని కాపాడుతున్నది మోడీనే
ఆయనను రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలిగించి ఆమెపైనా విచారణ జరపాలని రాహుల్ డిమాండ్
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పెట్టుబడుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ అమెరికాలో నమోదైన కేసుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. "అదానీని చర్యలకు అతడిని అరెస్టు చేసి శిక్షించాలి" అని రాహుల్ డిమాండ్ చేశారు. అదానీ పై తీవ్రమైన ఆరోపణలు పాలనలో అవినీతి ఆందోళనలను ఎత్తి చూపుతున్నాయన్నారు. సెబీ చీఫ్ మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందన్నారు. మోదీ, అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్టు చేసి విచారిస్తే విషయాలన్నీ బైటపడుతాయన్నారు. ఆయనను రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలిగించి ఆమెపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్ కోరారు. అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను మోడీ కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.