కాగ్ అధిపతిగా కొండ్రు సంజయ్‌మూర్తి ప్రమాణ స్వీకారం
ఆయన చేత ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
కొండ్రు సంజయ్‌మూర్తి ప్రతిష్టాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలు చేపట్టారు. కాగ్ అధిపతిగా ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన మొదటి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు.
అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. 1964 డిసెంబర్ 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021 నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ.. కేంద్రం ప్రవేశపెట్టిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలులో కీ రోల్ ఆయనదే. ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో రిటైర్మెంట్ కానున్న ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం నిన్నటితో ముగిసింది.