ఫలితాలకు 24 గంటల ముందే రిసార్ట్ రాజకీయాలు షురూ!
ఓట్ల లెక్కింపునకు ముందే కాకపుట్టిస్తున్న మరాఠా రిజల్ట్
మహారాష్ట్ర ఓటరు తీర్పు మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఫలితాలకు 24 గంటల ముందే మహారాష్ట్రలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు చేజారి పోకుండా రెండు కూటములు రిసార్ట్ రాజకీయాలకు తెరతీశాయి. అధికార మహాయుతి కూటమికే మళ్లీ పవర్ ఖాయమని అనేక ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చేశాయి. కొన్ని సర్వేలు మాత్రం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీనే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మరాఠా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం ముంబయిలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ ఒకే చోట ఉంచుతామని తెలిపారు. మహావికాస్ అఘాడీలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. కూటమి ఎమ్మెల్యేలందరినీ గెలిచిన వెంటనే ముంబయి తీసుకువస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా తాము గెలిస్తే కూటమికి మద్దతు ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారని తెలిపారు. మహావికాస్ అఘాడీకి ప్రజలు పట్టం కడితే సీఎం ఎవరు అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. కూటమి పార్టీలన్నీ కలిసే ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. తాము వేగంగా స్పందించకపోతే బీజేపీ అధికారాన్ని లాగేసుకుంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమిదే గెలుపు అన్నారు.