కసబ్ కేసు కూడా న్యాయంగానే విచారణ: సుప్రీం
యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించిన జమ్ముకశ్మీర్ బోర్డు ఆదేశాలను సీబీఐ సవాల్ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు
వేర్పాటువాది యాసిన్ మాలిక్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 26/11 ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కి కూడా ఈ దేశంలో న్యాయమైన విచారణ జరిగిందని పేర్కొన్నది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించిన జమ్ముకశ్మీర్ బోర్డు ఆదేశాలను సీబీఐ సవాల్ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదంటూ సీబీఐ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా "మేము అతన్ని జమ్మూ కాశ్మీర్‌కు తీసుకెళ్లడం ఇష్టం లేదు" అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఎజి మసీహ్‌లతో కూడిన ధర్మాసనానికి చెప్పారు. అయితే వీసీ (వీడియో కాన్ఫరెన్స్)లో క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా ప్రశ్నించారు. జమ్మూలో ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉందని బెంచ్ గుర్తించిందన్నారు.
మాలిక్ వ్యక్తిగతంగా హాజరుకావాలని పట్టుదలగా ఉంటే, విచారణను ఢిల్లీకి మార్చవచ్చని మెహతా చెప్పారు. వేర్పాటువాద నాయకుడు తాను వ్యక్తిగతంగా హాజరుకావాలని పట్టుబట్టడం ద్వారా "ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు" అని ఆయన అన్నారు.