ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఈ ఘటనలో 10 మావోయిస్టులు మృతి

Advertisement
Update:2024-11-22 12:06 IST

తుపాకుల మోతతో దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒడిషా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్‌జీ బృందం తనిఖీలు చేపట్టింది. దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది. భద్రతా బలగాలను చూసి నక్సల్స్‌ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపింది. ఎస్పీ కిరణ్‌ చవాన్‌ దీన్ని ధృవీకరించారు. శుక్రవారం తెల్లవారుజామున భెజ్జి ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందన్నారు. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఘటనాస్థలంలో ఆటోమేటిక్‌ రైఫిల్స్‌ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌-దంతెవాడ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మావోయిస్టులపై భద్రతా దళాలు సాధించిన అతి పెద్ద విజయమది.


Tags:    
Advertisement

Similar News