'మోదానీ' స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటుకు కాంగ్రెస్‌ డిమాండ్‌

'హమ్‌ అదానీ కే హై' సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించినా సమాధానం లేదని జైరామ్‌ రమేశ్‌ పోస్టు

Advertisement
Update:2024-11-21 11:42 IST

బిలియన్‌ డాలర్ల లంచం, మోసానికి పాల్పడిన అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. అదానీ గ్రూప్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని మరోసారి డిమాండ్‌ చేసింది. 'మోదానీ' స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్‌ చేస్తున్నామని పేర్కొన్నది. 'హమ్‌ అదానీ కే హై' సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, ఇంతవరకు సమాధానం రాలేదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అనంతరం అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించడానికి కంపెనీ యత్నించినట్లు పేర్కొన్నది. అదానీ గ్రీన్‌ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అదానీ సంస్థ కార్యకలాపాలపై కాంగ్రెస్‌ పార్టీ కొంతకాలంగా ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఆమ్‌ ఆద్మీ అభివృద్ధి కోసం పనిచేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అదానీ కోసమే పనిచేస్తున్నదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News