బీజేపీకి ఓటెయ్యొద్దు..వాళ్లు చాలా ప్రమాదం.. కర్ణాటక ప్రజలకు మమత విజ్ఞప్తి

మణిపూర్‌లో చెలరేగినట్లు పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు చెలరేగితే కేంద్ర ప్రభుత్వం ఊరుకునేదా..? అని మమత ప్రశ్నించారు. వందలాదిగా కేంద్ర బృందాలను పంపి తమపై బురదజల్లే ప్రయత్నం చేసేదన్నారు.

Advertisement
Update:2023-05-08 21:14 IST

కర్ణాటకలో ఇంకొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీకి ఓటు వేయవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ వారంతా ప్రమాదకారులని ఆమె చెప్పారు. ఎన్నికల ముంగిట మమత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. సోమవారం హౌరా లోని నబన్నాలో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా సుస్థిరత అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. బీజేపీకి ఓటు వేయవద్దని.. వాళ్లు ప్రమాదకారులని కర్ణాటక ప్రజలకు సూచించారు.

ఇక మణిపూర్‌లో అల్లర్ల కారణంగా ఆ రాష్ట్రం వణికిపోతోందని మమత చెప్పారు. మణిపూర్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే దానిపై బీజేపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. పోలీసుల కాల్పులతో పాటు సాధారణ హింసలో ఎంతమంది చనిపోయారన్నది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లర్లలో ఎంతమంది చనిపోయారనే లెక్కలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని విమర్శించారు. ఆ రాష్ట్రంలో అల్లర్ల కారణంగా దాదాపు 60 నుంచి 70 మంది వరకు చనిపోయినట్లు చెబుతున్నారన్నారు.

మణిపూర్‌లో చెలరేగినట్లు పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు చెలరేగితే కేంద్ర ప్రభుత్వం ఊరుకునేదా..? అని మమత ప్రశ్నించారు. వందలాదిగా కేంద్ర బృందాలను పంపి తమపై బురదజల్లే ప్రయత్నం చేసేదన్నారు. మీకో న్యాయం.. మాకో న్యాయమా? అని ఆమె మండిపడ్డారు.

మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే అక్కడ చనిపోయిన వారి సంఖ్య చెప్పడం లేదన్నారు. ఎలాంటి హడావుడి చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా మణిపూర్ లో ఎంతమంది మృతి చెందారో ప్రభుత్వం బహిర్గతం చేయాలని మమత కోరారు. మణిపూర్ లో అల్లర్ల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన 18 మంది విద్యార్థులను ఇంఫాల్ నుంచి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు మమత తెలిపారు.

Tags:    
Advertisement

Similar News