పేరు గొప్ప ఊరు దిబ్బ.. వందేభారత్ సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లే

అంచనా వేగంలో కనీసం మూడోవంతు కూడా అందుకోలేని సందర్భంలో ఆయా రూట్లలో అసలు వందేభారత్ ని ఎందుకు ప్రవేశ పెట్టారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Advertisement
Update:2023-04-18 13:04 IST

వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం కోసం నెలకోసారి ఒక్కో రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ కి వెళ్లి పచ్చ జెండా ఊపి వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మీ రాష్ట్రానికి రెండు రైళ్లిచ్చాం, మీకు మూడిచ్చామంటూ పప్పు బెల్లాల్లా వందేభారత్ రైళ్లను పంచిపెడుతున్నారు. బుల్లెట్ రైళ్లు దించేశాం, భారత్ ని హైస్పీడ్ గా మార్చేశాం.. అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ అదంతా వట్టి డొల్లేనని తేలిపోయింది. భారత్ లో వందేభారత్ రైలు సగటు వేగం కేవలం 83 కిలోమీటర్లు మాత్రమే. అంటే రాజధాని, శతాబ్ది వేగాన్ని కూడా వందే భారత్ అందుకోలేకపోతోంది. భారత్ లో ఇప్పటి వరకూ హైస్పీడ్ రైలుగా ఉన్న గతిమాన్ ఎక్స్ ప్రెస్ తో కూడా వందే భారత్ పోటీ పడలేకపోతోంది. గతిమాన్ గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా.. 90కిలోమీటర్లకంటే ఎక్కువ స్పీడ్ తో ఆ రైలు పట్టాలపై పరుగులు తీస్తుంది. వందే భారత్ విషయానికొస్తే గరిష్ట వేగంట 180 కిలోమీటర్లు అయినా.. ప్రస్తుతం భారత్ లో వందేభారత్ సగటు వేగం కేవలం 83 కిలోమీటర్లు మాత్రమే.

సరిపడా ట్రాక్ లు లేవు..

అన్నీ అనుకున్నట్టు జరిగితే వందే భారత్ రైలు గంటకు 180కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కానీ మన రైల్వే ట్రాక్ లు అందుకు సహకరించవు. అనుకున్న వేగంలో సగం కూడా వందేభారత్ అందుకోలేకపోవడమే ఇక్కడ విశేషం. కేవలం ఒకరూట్లో మాత్రమే వందేభారత్.. గంటకు 95 కిలోమీటర్ల వేగం అందుకుంది. ఢిల్లీ-వారణాసి రైలు సగటున గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రాణి కమలాపతి భోపాల్-హజ్రత్ నిజాముద్దీన్ రైలు గంటకు 94 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మిగతా చోట్ల ఉన్న రైల్వే ట్రాక్ లు ఈ స్పీడ్ ని తట్టుకునే సామర్థ్యంతో లేవు.

అత్యల్పం 64 కిలోమీటర్లు..

సీఎస్టీ-సాయినగర్ షిర్డీ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు సగటు వేగం గంటకు కేవలం 64 కిలోమీటర్లు మాత్రమే. దీని సామర్థ్యం 180 కిలోమీటర్లు అయినా అందులో మూడోవంతుకే పరిమితం కావాల్సి వస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడంతో ఈ బండారం బయటపడింది. మరో విశేషం ఏంటంటే.. 2021-22లో వందేభారత్ సగటు వేగం 84.48గా కాగా, 2022-23లో 81.38 కిలోమీటర్లకు తగ్గింది. రైళ్ల సంఖ్య పెరుగుతుంటే సగటు వేగం తగ్గిపోతోంది.

పేరుగొప్ప..

రైల్వే ట్రాక్ లు సరిగా లేకపోయినా రైళ్లను మాత్రం ఘనంగా ప్రారంభించేస్తున్నారు నాయకులు. ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ వందేభారత్ విషయంలో ఈ గాలి బుడగ పగిలిపోయింది. కేంద్రం డొల్లతనం బయటపడింది. అంచనా వేగంలో కనీసం మూడోవంతు కూడా అందుకోలేని సందర్భంలో ఆయా రూట్లలో అసలు వందేభారత్ ని ఎందుకు ప్రవేశ పెట్టారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. 

Tags:    
Advertisement

Similar News