నల్ల చొక్కాలు, రామ భక్తులు.. యోగి వింత లాజిక్..

రామ జన్మభూమి నిర్మాణానికి నాంది పలికిన రోజే కాంగ్రెస్ నేతలు నల్లచొక్కాలు ఎందుకు ధరించాలంటూ ఆయన ఓ వింత లాజిక్ బయటకు తీశారు.

Advertisement
Update:2022-08-06 09:20 IST

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, జీఎస్టీ వాతలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. అయితే గతంలోకంటే భిన్నంగా ఈసారి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సహా అందరూ నల్ల చొక్కాలతో రోడ్డెక్కారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, దేశం నియంతల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై సహజంగానే బీజేపీ రాజకీయ ఎదురుదాడికి దిగింది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత, ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీ మనవడిగా రాహుల్ కి లేదన్నారు బీజేపీ నేతలు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం సంబంధంలేని విషయాన్ని మధ్యలోకి తెచ్చారు. కాంగ్రెస్ నేతలు నల్లచొక్కాలు ధరించడాన్ని ఆయన తప్పుబడ్డారు. రామ జన్మభూమి నిర్మాణానికి నాంది పలికిన రోజే కాంగ్రెస్ నేతలు నల్లచొక్కాలు ఎందుకు ధరించాలంటూ ఆయన ఓ వింత లాజిక్ బయటకు తీశారు.

అయోధ్య దివస్ ని అవమానిస్తారా..?

రామ జన్మభూమి నిర్మాణానికి నాంది పలికిన రోజుని అయోధ్య దివస్ గా జరుపుకుంటున్నామని, ఆ రోజునే కాంగ్రెస్ నేతలు నల్లచొక్కాలతో నిరసన తెలపడం ఏంటని మండిపడ్డారు యోగి. రామ భక్తుల మనోభావాలను వారు దెబ్బతీశారంటున్నారు. ఇలాంటి చర్యలతో భారతీయుల విశ్వాసాలను అవమానించారంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ వైఖరి ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను అవమానపరిచేలా ఉందని చెప్పారు యోగి. నల్లచొక్కాల నిరసనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఇదెక్కడి లాజిక్..

నిరసన కార్యక్రమాల్లో నల్ల రిబ్బన్లు కట్టుకోవడం, నల్ల చొక్కాలు ధరించడం, ఇటీవల కాలంలో నల్ల బెలూన్లు ఎగరేయడం కామన్ గా మారింది. అయితే కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఎంచుకున్న విధానమే విచిత్రంగా ఉంది. బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించేందుకే కాంగ్రెస్ ఇలా నల్లచొక్కాలు ధరించిందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, రామ జన్మభూమికి పునాది వేసిన ఈ రోజునే నల్లరంగు బట్టలు ధరించి తప్పుడు సంకేతాలిస్తున్నారని అన్నారు అమిత్ షా. మొత్తమ్మీద కాంగ్రెస్ నిరసనలకంటే.. వారు ధరించిన నల్ల దుస్తులు, ఆ దుస్తులపై బీజేపీ మొదలు పెట్టిన రాజకీయం ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News