కరెంటు లేకపోతే అదొక్కటే పని.. కేంద్ర మంత్రి కామెడీ
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాటలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆ కామెడీకి మళ్లీ వ్యాఖ్యానాలు కూడా అనవసరం అని కేవలం స్మైలీ ఎమోజీలు మాత్రమే పెట్టారు కేటీఆర్.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ సరిగ్గా లేదు, దాని పర్యవసానం ఏంటో తెలుసా..? కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కర్నాటకలో ఓ బహిరంగ సభలో ప్రజలకు ఈ ప్రశ్న వేశారు. కరెంటు సరఫరా లేకపోవడం వల్ల పారిశ్రామికాభివృద్ధి కుంటు పడుతుందని, దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఆయన చెబుతారేమో అనుకున్నారు సభకు వచ్చినవారు. కానీ కేంద్ర మంత్రి మరీ మోటు హాస్యం పండించారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు సరఫరా సరిగా లేకపోవడం వల్ల జనాభా పెరిగిందని చెప్పుకొచ్చారు. పోనీ ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడి తర్వాత సర్దుకున్నారా అంటే అదీ లేదు. ఆయన ఉద్దేశం అదే, అందుకే ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
కాంగ్రెస్ వాళ్లు కరెంటు ఎప్పుడైనా సరిగా ఇచ్చారా, దాని పర్యవసానంగా దేశంలో జనాభా పెరిగింది. మోదీ హయాంలో 24గంటలు కరెంటు సరఫరా ఉంది, అందుకే ఇప్పుడు జనాభా పెరుగుదల నియంత్రణలో ఉంది. రేపు కాంగ్రెస్ వాళ్లు ఉచిత కరెంటు అంటే ఎవరూ నమ్మి మోసపోవద్దు. అంటూ కర్నాటక ఎన్నికల ప్రచారంలో సెలవిచ్చారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఆయన వ్యాఖ్యలకు సభలో ఉన్నవారే కాదు, సోషల్ మీడియా అంతా పగలబడి నవ్వుతోంది.
కేటీఆర్ రియాక్షన్..
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాటలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. రెండు స్మైలీ ఎమోజీలు పెట్టి ట్వీట్ చేశారు. ఆ కామెడీకి మళ్లీ వ్యాఖ్యానాలు కూడా అనవసరం అని కేవలం స్మైలీ ఎమోజీలు మాత్రమే పెట్టారు కేటీఆర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయనపై కౌంటర్లు ఓ రేంజ్ లో పడుతున్నాయి. బీజేపీ వాళ్లకు కనీసం కవర్ చేసుకోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆయన్ను సమర్థిస్తూ ఏ ఒక్కరూ స్పందించడంలేదు. పోనీ పవర్ కట్స్ గురించి ట్వీట్ చేయడానికి కూడా ఎవరూ సాహసం చేయడంలేదు. అలాంటి సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. తాను నవ్వులపాలవడంతోపాటు, బీజేపీని కూడా నవ్వులపాలు చేశారు.