మా చేతుల్లో ఏం లేదు, బీ అలర్ట్.. బ్యాంకర్లతో నిర్మలమ్మ
అసలే భారత్ లో ప్రధాని-అదాని వ్యవహారం ముదిరిపోయింది. అదానీవంటి కంపెనీలకు అప్పులిచ్చిన బ్యాంక్ లు తిప్పలు కొనితెచ్చుకున్నాయి. ఈ దశలో బ్యాంకింగ్ వ్యవస్థతో మరో ఇబ్బంది రాకముందే కేంద్రం అలర్ట్ అయింది.
అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థలు ఇటీవల తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) అధిపతులతో సమావేశమయ్యారు. భారత్ లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ (PSB) పనితీరును ఆమె సమీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సెంట్రల్ బ్యాంక్ ల వడ్డీ రేట్లతో ముప్పు పొంచి ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె PSB అధిపతులను కోరారు.
మా చేతుల్లో ఏం లేదు..?
బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలకుండా ఆపడం ప్రభుత్వం చేతుల్లో లేదని తేల్చి చెప్పారు నిర్మలమ్మ. బ్యాంకులే దీనికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని అంచనా వేసుకోవాలని, రిస్క్ మేనేజ్ మెంట్ తో పాటు డిపాజిట్లు, ఆస్తుల విషయంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రతికూలంగా మారే అవకాశమున్న పెట్టుబడులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మలచుకోవాలని, సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు సమాచార వ్యూహాలపై సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని హితబోధ చేశారు.
అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB), సిగ్నేచర్ బ్యాంక్.. ఒకదాని తర్వాత ఒకటి దివాలా తీశాయి. క్రెడిట్ స్విీస్ బ్యాంక్ కూడా దివాలా అంచుకి రావడంతో, స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ అప్రమత్తమై.. యూబీఎస్ తో కొనుగోలుకి ప్రోత్సహించింది. జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇటీవల పరిణామాలతో అమెరికాలోని చిన్న చిన్న బ్యాంక్ ల నుంచి కస్టమర్లు పెద్ద ఎత్తున డిపాజిట్లు వెనక్కు తీసుకుంటున్నారు. ఇదే పరిస్థితి భారత్ కు వస్తే మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. లోపాల విషయం పక్కనపెడితే.. కస్టమర్లంతా ఒకేసారి డిపాజిట్లు వెనక్కు తీసుకోడానికి ప్రయత్నిస్తే మాత్రం బ్యాంకులు తట్టుకోలేవు. చేతులెత్తేయాల్సిందే.
అసలే భారత్ లో ప్రధాని-అదాని వ్యవహారం ముదిరిపోయింది. అదానీవంటి కంపెనీలకు అప్పులిచ్చిన బ్యాంక్ లు తిప్పలు కొనితెచ్చుకున్నాయి. ఈ దశలో బ్యాంకింగ్ వ్యవస్థతో మరో ఇబ్బంది రాకముందే కేంద్రం అలర్ట్ అయింది. PSB లతో సమావేశమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇప్పటివరకు ఏయే బాండ్లలో పెట్టుబడులు పెట్టారనే సమాచారం కోరారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.