మద్యానికి బానిసైనవారికి ఆడపిల్లలను ఇవ్వొద్దు .. కేంద్ర మంత్రి విజ్ఞప్తి
తాను తన కుమారుడిని రక్షించుకోలేకపోయానని, అతడి భార్య వితంతువుగా మారిందని ఆవేదన చెందారు. దయచేసి మీరు మీ కుమార్తెలు, అక్క, చెల్లెళ్లను మద్యం తాగే అలవాటు ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేయవద్దని కేంద్ర మంత్రి కోరారు
మీ ఇంటి ఆడపడుచులను మద్యం అలవాటు ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేయవద్దని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ విజ్ఞప్తి చేశారు. మద్యానికి బానిసైన అధికారికి పిల్లనిచ్చి పెళ్లి చేయడం కంటే రిక్షా తొక్కుకునే వారికి, కూలి పనులు చేసుకునే వారికి పిల్లనివ్వడం ఉత్తమమని ఆయన సూచించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం అలవాటు విముక్తి (డీ అడిక్షన్ ) పై నిర్వహించిన ఒక కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యానికి బానిసైన వారి జీవితకాలం చాలా తక్కువని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒక అనుభవాన్ని ప్రజలకు వివరించారు. తానొక ఎంపీ నని, తన భార్య ఎమ్మెల్యే అని.. అయినా మద్యానికి అలవాటు పడ్డ తమ కుమారుడి జీవితాన్ని కాపాడుకోలేకపోయామని భావోద్వేగానికి గురయ్యారు. స్నేహితులతో ఎక్కువగా కలిసి తిరిగే తన కుమారుడు మద్యానికి బానిస అయ్యాడని, అతడికి ఆ అలవాటు మాన్పించేందుకు డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్చామని చెప్పారు.
డీ అడిక్షన్ కేంద్రం నుంచి వచ్చిన ఆరు నెలలకే అతడికి పెళ్లి చేశామని చెప్పారు. అయితే పెళ్లయిన ఆరు నెలల నుంచే మళ్లీ తన కుమారుడు తాగడం మొదలు పెట్టాడన్నారు. ఆ తర్వాత చివరికి మద్యం తాగే అలవాటు తన కుమారుడి ప్రాణాలు తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు మృతి చెందే సమయానికి.. అతడికి కేవలం రెండేళ్ల కొడుకు ఉన్నాడని చెప్పారు.
తాను తన కుమారుడిని రక్షించుకోలేకపోయానని, అతడి భార్య వితంతువుగా మారిందని ఆవేదన చెందారు. దయచేసి మీరు మీ కుమార్తెలు, అక్క, చెల్లెళ్లను మద్యం తాగే అలవాటు ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేయవద్దని కేంద్ర మంత్రి కోరారు. కేవలం మద్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 20 లక్షల మంది చనిపోతున్నారని, 80% క్యాన్సర్ మరణాలకు పొగాకు, సిగరెట్లు, బీడీల అలవాటే కారణమని ఆయన వివరించారు.