నేడు ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
రాకెట్ ప్రయోగం ప్రారంభం అయిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నావిగేషన్ శాటిలైట్ ఎన్‌వీఎస్-01ను ఇవ్వాళ ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్‌వీ-ఎఫ్12 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం 7.12కు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ప్రారంభమైంది. 27.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈ రోజు సెకెండ్ లాంచ్ పాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది.
ఈ ప్రయోగానికి ఉపయోగిస్తున్న జీఎస్ఎల్‌వీ-ఎఫ్12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. రాకెట్ ప్రయోగం ప్రారంభం అయిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటు పని చేస్తుంది.
ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నావిగేషన్ సర్వీసెస్ కోసం ఉపయోగిస్తారు. గతంలో నావిగేషన్ సేవల కోసం ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల్లో నాలుగింటి జీవిత కాలం ముగిసింది. దీంతో తాజాగా ఎన్‌వీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడుతున్నారు. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) పేరుతో ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది. కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం.. గ్రౌండ్ స్టేషన్‌తో కలిసి పని చేస్తుంది.
సాయుధ దళాలు, పౌర విమానయాన రంగానికి మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్ కోసం ఈ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లలో ఎన్‌వీఎస్-1 మొదటిదని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ సిరీస్‌లో మరిన్ని శాటిలైట్లు ప్రవేశపెడతారు. ఎల్ఐ బ్యాండ్‌లో కొత్త సేవలను కూడా ఈ శాటిలైట్ అందిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 2,232 కిలోలు. ఇది భారత ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కిలోమీటర్ల మేర రియల్ టైం పొజిషనింగ్ సేవలు అందిస్తుంది.