కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు వెళ్తున్నారు : శశిథరూర్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది బీజేపీ వైపు వెళ్తున్నారని వాళ్ళను ఆపడమే తన ప్రథమ కర్తవ్యమని శశి థరూర్ అన్నారు. జాతీయ స్థాయిలో అన్ని విపక్ష పార్టీలను కలుపుకుని పోతూ నూతన కూటమిని ఏర్పాటు చేయడం ప్రధాన కర్తవ్యాలలో మరొకటని ఆయన అన్నారు.
కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరు అయినప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం జాతీయ స్థాయిలో అన్ని విపక్ష పార్టీలను కలుపుకుని పోతూ నూతన కూటమిని ఏర్పాటు చేయడం ప్రధాన కర్తవ్యాలలో ఒకటని తిరువనంతపురం ఎంపి, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశిథరూర్ అన్నారు. ఇదే తమ మొదటి పరీక్షగా ఉంటుంది అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రె్స్ ప్రజల కోసం పలువురు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎలా పనిచేసిందో కొత్త అధ్యక్షుడు కూడా అలాగే ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు.
కాంగ్రెస్ నాయకులను పార్టీ వదిలిపెట్టి ప్రత్యర్థి బిజెపిలో చేరకుండా ఆపడానికి ప్రయత్నిస్తానని థరూర్ చెప్పారు. తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తాను తీసుకునే ముఖ్యమైన చర్యలలో ఇదొకటి అన్నారు.
"ఖర్గే సార్ నా నాయకుడు కూడా. మేము శత్రువులం కాదు. కాంగ్రెస్‌లో మార్పు కోసం నేను అభ్యర్థిగా పోటీలో ఉన్నాను" అని థరూర్ చెప్పారు. అస్సాంలోని గౌహతిలో తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు వచ్చినట్లు చెప్పారు. సీనియర్ నాయకులంతా ఖర్గేకు, యవనాయకులంతా మార్పు కోరుకుంటున్న తనకు మద్దతుగా నిలుస్తున్నారని" చెప్పారు.
"నాకు మద్దతిచ్చిన వ్యక్తులు తిరుగుబాటుదారులు కాదు, గాంధీలకు వ్యతిరేకం అసలే కాదు..ఇది తప్పుడు భావన. గాంధీలు ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉంటారు, మేము కూడా అలాగే ఉంటాము. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది కాంగ్రెస్‌దే విజయం అనే స్పూర్తితో మేం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం'' అని థరూర్ ఎంతో సామరస్య ధోరణితో మాట్లాడారు. కాగా శశి థరూర్ కు మరో సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది.