డీఎంకే ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం..? పళని స్వామి మాటలకు అర్థమేంటి..?
మాజీ సీఎం పళని స్వామి మాటలు వింటే భవిష్యత్తులో బీజేపీ ఆ సాహసానికి కూడా ప్రయత్నించవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. 10మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమ వర్గంతో టచ్ లో ఉన్నారని అంటున్నారు పళని స్వామి.
ఢిల్లీ, జార్ఖండ్‌లో ఫెయిల్ అయిన `ఆపరేషన్ లోటస్` తమిళనాడులో కూడా మొదలవుతుందా..? డీఎంకే ఎమ్మెల్యేలకు కమలదళం గాలమేస్తుందా..? తమిళ తంబీలు అంత ఈజీగా బీజేపీ గాలానికి చిక్కుతారా..? ఇప్పటికిప్పుడు దీనికి కచ్చితంగా సమాధానం చెప్పడం కష్టం. కానీ, మాజీ సీఎం పళని స్వామి మాటలు వింటే భవిష్యత్తులో బీజేపీ ఆ సాహసానికి కూడా ప్రయత్నించవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. 10మంది డీఎంకే ఎమ్మెల్యేలు తమ వర్గంతో టచ్ లో ఉన్నారని అంటున్నారు పళని స్వామి.
అన్నాడీఎంకే నుంచి వలసలుంటాయా..?
ఇటీవల అన్నాడీఎంకేలో లుకలుకలు మొదలయ్యాయి. పన్నీర్, పళని రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారు. మధ్యలో శశికళ ఎంట్రీ ఇస్తోంది. టీటీవీ దినకరన్ కూడా అదనుకోసం ఎదురుచూస్తున్నారు. ఈ దశలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెల్లాచెదరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు డీఎంకే గూటికి చేరుకుంటున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై పళని స్వామి స్పందించారు. తమ ఎమ్మెల్యేలు డీఎంకేలో చేరతారనడం అవాస్తవం అని, డీఎంకే ఎమ్మెల్యేలే తమతో టచ్ లో ఉన్నారని అంటున్నారు పళని స్వామి.
పళని మాటల్ని మరీ అంత లైట్ తీసుకోలేం. తమిళనాడులో ఆయన పన్నీర్ పెత్తనాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. తన వర్గాన్ని ముందుగానే పక్కకు తీసుకెళ్లారు. పన్నీర్ కి అసలు పార్టీలో సీన్ లేకుండా చేశారు. అలాంటి పళని, బీజేపీతో కలసి డీఎంకే ఎమ్మెల్యేల విషయంలో కుట్రలు చేయలేరని అనుకోలేం. అయితే ఈ కుట్రలు ఇప్పుడే మొదలయ్యాయా..? అదను చూసి భవిష్యత్తులో మొదలు పెడతారా అనేది వేచి చూడాలి.