మోడీ సార్.. భలే కవర్ చేశారు.. స్టాలిన్ ఫైర్
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అడిగిన అనేక ప్రశ్నలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడం సరికాదన్నారు. రికార్డుల నుంచి తొలగించినంత మాత్రాన.. ప్రజల మనసుల్లోంచి ఆ విషయాలు చెరిగిపోవని చెప్పారు.
తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా.. ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా పార్లమెంట్ లో ప్రధాని మోడీ బాగా కవర్ చేశారని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విమర్శలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి ఎలా చేయాలో మోడీని చూసి నేర్చుకోవచ్చన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ అంశం, అదానీ ఆస్తుల పతనం అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చను రేకెత్తిస్తుంటే ప్రధాని ఆ విషయాల మీద కనీసం మాట్లాడకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
మంగళవారం ఆయన చెన్నైలో నిర్వహించిన ‘ఉంగాళిల్ ఒరువన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఎన్నో విలువైన ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. వాటిని బీజేపీ నేతలు, ముఖ్యంగా ప్రధాని పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు.
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అడిగిన అనేక ప్రశ్నలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడం సరికాదన్నారు. రికార్డుల నుంచి తొలగించినంత మాత్రాన.. ప్రజల మనసుల్లోంచి ఆ విషయాలు చెరిగిపోవని చెప్పారు.
హిండెన్ బర్గ్ నివేదిక, బీబీసీ డాక్యుమెంటరీ ఇటీవల దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అదానీకి బీజేపీకి ఉన్న సత్సంబంధాల మీద జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై బీజేపీ స్పందించకుండా ఎదురుదాడికి దిగుతోంది. కాగా, తాజాగా ఈ అంశాలను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రస్తావించారు.