తీస్తాసెతల్వాద్ బెయిల్ పిటిషన్ పై గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

సామాజిక కార్యకర్త తీస్తాసెతల్వాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను వెంటనే విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు, గురువారం లోగా ఆ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసును ఈ నెల 25కు వాయుదా వేసింది.

Advertisement
Update:2022-08-22 22:09 IST

సామాజిక కార్యకర్త తీస్తాసెతల్వాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను పురస్కరించుకుని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరగాలని ఆమె తరఫు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ కోరగా ఇందుకు అంగీకరించింది. ఈ నెల 25 న విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ యూ.యూ. లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాన్షు ధులియా లాలతో కూడిన బెంచ్ ఆ రోజున ఈ పిటిషన్ ను విచారించనుంది. తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని తీస్తాసెతల్వాద్ కోర్టును అభ్యర్థించారు. దీనిపై సోమవారం ఉదయం కోర్టులో జస్టిస్ లలిత్.. కపిల్ సిబల్ మధ్య కొద్దిసేపు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. గుజరాత్ లో 2002 లో జరిగిన అల్లర్లకు సంబంధించి సోహ్రబుద్దీన్ మర్డర్ కేసులో తాను కొంతమంది నిందితుల తరఫున వాదించానని జస్టిస్ లలిత్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఈ కేసును మీరు విచారిస్తున్నందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని కపిల్ సిబల్ చెప్పారు. అయితే ఏం జరుగుతోందో చూడాలని, సుప్రీంకోర్టు ఆర్డర్ నుంచి కేసు ఉత్పన్నమైందని..467 సెక్షన్ కి సంబంధించిన పిటిషన్ హైకోర్టు ముందు ఎలా ఉంటుందని ఆయన అన్నారు. తన క్లయింటు జూన్ 25 నుంచి కస్టడీలోనే ఉన్నారని..బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ని సెషన్స్ కోర్టు కొట్టివేయడంతో .. మళ్ళీ తిరిగి హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేశామని ఆయన చెప్పారు. కానీ సిట్ కి కోర్టు నోటీసు జారీ చేస్తున్న సందర్భంగా సెప్టెంబరు 19 లోగా దీనికి సమాధానమివ్వాలని ఆదేశించిందన్నారు .. అందువల్లే ప్రస్తుతం ఈ అప్పీలు దాఖలు చేసినట్టు స్పష్టం చేశారు. .కాగా .. తాము గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, వీటికి గురువారం లోగా ఆ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు జడ్జీల బెంచ్ వెల్లడించింది. ఈ అంశం గుజరాత్ హైకోర్టులో పెండింగులో ఉన్నప్పటికీ పిటిషన్ దారుకు తాత్కాలిక బెయిల్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.

ఈ ఏడాది ఆరంభంలో తనను పోలీసులు అరెస్టు చేసిన తరువాత ..తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తీస్తాసెతల్వాద్ ఈ నెల 2 న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమెతో బాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్. బీ.శ్రీకుమార్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై స్పందించవలసిందిగా సిట్ పోలీసులకు గుజరాత్ హైకోర్టు నోటీసు జారీ చేసింది. దీనిపై సెప్టెంబరు 19 న విచారణ జరగాలని ఆదేశించింది. అయితే ఇంత సుదీర్ఘ కాలం సముచితం కాదని, త్వరగా విచారణ జరిగేలా చూడాలని కోరుతూ తీస్తాసెతల్వాద్ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. సత్యేందర్ కుమార్ అంటిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బెయిల్ కు సంబంధించిన విచారణ శీఘ్రగతిన జరగాలని ఆమె పేర్కొన్నారు. ఇంత జరిగినా ఈ కేసులో హైకోర్టు ఒకటిన్నర నెలలకు ఫస్ట్ డేట్ ని నిర్ణయించిందని ఆమె అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. జకియా జాఫ్రీ పిటిషన్ ని కొట్టివేసిన సందర్భంగా గత జూన్ 24 న సుప్రీంకోర్టులో ముగ్గురు జడ్జీల బెంచ్.. తీస్తాసెతల్వాద్ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. 2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో కాంగ్రెస్ నేత ఎహసాన్ జాఫ్రీ హత్యకు గురయ్యారు. ఆ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన భార్య జకియా జాఫ్రీ సవాలు చేశారు. బాధితుల తరఫున నిలిచిన తీస్తాసెతల్వాద్ ని గుజరాత్ సిట్ పోలీసులు ముంబైకి వచ్చి అరెస్టు చేశారు. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు జులై 30 న అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఆమె తరఫున కపిల్ సిబల్ తో బాటు అపర్ణా భట్ అనే మరో లాయర్ కూడా వాదిస్తున్నారు.




Tags:    
Advertisement

Similar News