ఆయన అంత మొనగాడా..? కేంద్రానికి సుప్రీం చీవాట్లు..

మిశ్రా కంటే మొనగాడు ఈడీలో ఇంకెవరూ లేరా అని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. నవంబర్లో ఆయన రిటైర్ అయితే ఆ పోస్ట్ ని ఏం చేస్తారంటూ కేంద్రాన్ని కడిగిపారేసింది.

Advertisement
Update:2023-05-04 07:33 IST

ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ). ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ చేయాల్సిన పని ఏంటి..? చేస్తున్నదేంటి..? అనే విషయం దేశంలోని ప్రతిపక్షాలతో సహా అందరికీ తెలిసిందే. కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ, ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చే పనులు మాత్రమే ఈడీ చేస్తోందనే ఆరోపణలున్నాయి. కనీసం ఈ దర్యాప్తు సంస్థ అధిపతి మారినా పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఏరికోరి సంజయ్ కుమార్ మిశ్రా అనే అధికారికి పదవీకాలం పొడిగిస్తూ ఆయన్ను ఈడీ ఆఫీస్ లోనే ఐదేళ్లుగా ఉంచేసింది కేంద్రం. ఇటీవల ఈ వ్యవహారంపై దాఖలైన వివిధ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఒక వ్యక్తి సేవలు ఆ సంస్థకు అంత అవసరమా అని ప్రశ్నించింది. పదవీ విరమణ చేసిన వ్యక్తిని మహా అయితే నెల, రెండు నెలలు కొనసాగించ వచ్చని, కానీ.. ఏళ్లతరబడి ఆయన సేవలు పొందాలనుకోవడం సరికాదని చెప్పింది.

విచారణ సందర్భంగా కేంద్రం తరపున వాదనలు వినిపించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. పరిపాలనాపరమైన కారణాలు, ఆర్థిక చర్యల కార్య దళం (FATF) చేస్తున్న మదింపు దృష్ట్యా ఈడీ డైరెక్టర్‌ సేవల్ని పొడిగించాల్సి వచ్చిందని సుప్రీంకోర్టుకి తెలిపారాయన. ఆయన సమాధానం విన్న ధర్మాసనం.. ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన సేవలు అంత అవసరమా అని ప్రశ్నించింది. ఈడీలో ఇంకెవరూ సమర్థులు లేరా అని అడిగింది. ఈ ఏడాది నవంబర్ లో ఆయన రిటైర్ అయితే ఆ పోస్ట్ లో ఇంకెవర్ని తీసుకుంటారని ప్రశ్నించింది. అప్పుడు డైరెక్టర్ పోస్ట్ ని ఏం చేస్తారని అడిగింది.

అదో పెద్ద స్టోరీ..

2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు సంజయ్ కుమార్ మిశ్రా. అది రెండేళ్ల సర్వీసు, అంటే ఆయన 2020లో పదవీ విరమణ చేయాలి. కానీ ఆయన కోసం మరో ఏడాది ఆ సర్వీసుని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, 2021 వరకు అవకాశమిచ్చారు. పోనీ అప్పుడయినా కొత్తవారిని తీసుకున్నారా అంటే అదీ లేదు. 2021లో ఆయన పదవీ కాలాన్ని ఏడాదిపాటు పొడిగించారు. పోనీ 2022లో అయినా రిటైర్మెంట్ ఇచ్చి వీడ్కోలు చెబుతారనుకుంటే, సరిగ్గా నెలరోజుల్లో ఆయన పదవీ విరమణ చేస్తారనుకుంటున్న టైమ్ లో మళ్లీ ఏడాదిపాటు టైమ్ పొడిగించారు. అంటే మొత్తంగా ఆయనకు ఐదేళ్లు ఆ పదవిని అంకితం చేశారనమాట. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న వేళ, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కొనసాగిస్తున్న సుప్రీం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. మిశ్రా కంటే మొనగాడు ఈడీలో ఇంకెవరూ లేరా అని సూటిగా ప్రశ్నించింది. నవంబర్లో ఆయన రిటైర్ అయితే ఆ పోస్ట్ ని ఏం చేస్తారంటూ కేంద్రాన్ని కడిగిపారేసింది. 

Tags:    
Advertisement

Similar News