సబ్‌ కా ప్రయాస్‌ - సబ్‌ కా కర్తవ్య్‌.. నూతన రాష్ట్రపతి నినాదం..

చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లి చదువుకోవడమే ఓ కలగా ఉన్న తాను ఆ స్థాయినుంచి ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని అన్నారామె.

Advertisement
Update:2022-07-25 12:10 IST

ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం కూడా చేసుకోవచ్చని, అందుకు తానే ఒక నిదర్శనం అని చెప్పారు భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒడిశాలోని ఓ మారుమూల ఆదివాసీ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన తాను దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇది తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ దక్కిన విజయం అని చెప్పారు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లి చదువుకోవడమే ఓ కలగా ఉన్న తాను ఆ స్థాయినుంచి ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని అన్నారామె.

సరిగ్గా ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము, ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలు, తొలి గిరిజన మహిళ కావడం విశేషం. స్వతంత్ర భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా తాను గర్వపడుతున్నానని చెప్పారు ద్రౌపది ముర్ము. "50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 75 ఏళ్ల ఉత్సవాల వేళ ప్రథమ పౌరురాలి పీఠానికి ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నా" అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారామె. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగించాల్సి ఉందని, 'సబ్‌కా ప్రయాస్‌ - సబ్‌కా కర్తవ్య్‌' నినాదంతో ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. అభివృద్ధి నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. యువత కేవలం తమ భవిష్యత్తు మీదే కాకుండా దేశ పురోభివృద్ధికి బాటలు వేయడంపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. దేశ ప్రథమ పౌరురాలిగా యువతకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు ద్రౌపది ముర్ము.

Tags:    
Advertisement

Similar News