'సీజేఐ కి ఏం ఉచితాలు అందుతున్నాయి ? '

సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ కు ఏం ఉచితాలు అందుతున్నాయని ఆర్ ఎల్ డీ నేత జయంత్ చౌదరి ప్రశ్నించారు. దేశంలో ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Advertisement
Update:2022-08-12 12:54 IST

ప్రజలకు ఉచితాలు అందించడంపై ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు జయంత్ చౌదరి తీవ్రంగా ఖండించారు. సీజేఐకి ఏం ఉచితాలు అందుతున్నాయని జయంత్ చౌదరి ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు.



కాగా బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశంలో ఉచిత రేవ్డీ (స్వీట్లు) పంపిణీ చేయడం ద్వారా ఓట్లు సేకరించే సంస్కృతిని తీసుకురావడానికి కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉచిత వాగ్దానాల ద్వారా ఓట్లు దండుకుంటున్న రేవ్డీ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించిన ప్రధాని మోదీ ఇది దేశ అభివృద్ధికి 'చాలా ప్రమాదకరం' అని అన్నారు.



ఆరోజు నుంచి దేశంలో ఉచిత పథ‌కాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. మోదీ, బీజేపీపై విపక్షాలు విరుచుకపడుతున్నాయి. తన స్నేహితులైన పెట్టుబడిదారులకు లక్షల కోట్లు రుణాలను మాఫీ చేస్తున్న మోదీ ఉచిత పథకాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని తెలంగాణ మంత్రి కేటీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీం కోర్టులో జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు విమర్షలు ఎక్కుపెట్టాయి.


ఉచితాల కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్నదని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే సంక్షేమాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అయితే ఉచితాల కోసం రాజకీయ పార్టీలను నిషేధించలేమని ఆయన స్పష్టం చేశారు.



జస్టిస్ రమణ వ్యాఖ్యలపై RLD చీఫ్ జయంత్ చౌదరి ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు.#RevdiCulture అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి '' "గౌరవనీయమైన భారత ప్రధాన న్యాయమూర్తికి అందించిన 'ఉచితాలు' ఏమిటి?'' అని ప్రశ్నించారు.



"SC యొక్క ఇటీవలి వ్యాఖ్యలు చాలా సాహసోపేతమైనవి, సరైన స్ఫూర్తిని కూడా కలిగించడం లేదు.పిరమిడ్ వ్యవస్థ దిగువన ఉన్న ప్రజలకు రేషన్, ఆర్థిక సహాయం అందించడం అవసరం. ఇది ప్రజల‌ జీవించే హక్కు అనే ప్రాథమిక హక్కును రక్షించడం కోసమే.'' అని జయంత్ చౌదరి కామెంట్ చేశారు.




ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే చాలా ఉచిత వాగ్దానాలు మేనిఫెస్టోలో భాగం కావని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యపై కూడా ఆర్‌ఎల్‌డి చీఫ్ బిజెపిపై మండిపడ్డారు.



"బీజేపీ విషయంలో అది నిజం కావచ్చు కానీ మా విషయంలో కాదు! మా యుపి శాసన‌సభ ఎన్నికల ప్రచార ప్రసంగాలలో మా మేనిఫెస్టోలో పొందుపర్చిన‌ వాగ్దానాలనే మేం ప్రస్తావించాం" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.



మొత్తానికి ప్రధాని మోడీ చేసిన రేవ్డీ సంస్కృతి వ్యాఖ్యలు దేశంలో పెద్ద వివాదమే సృష్టిస్తున్నాయి. అధికార, విపక్షాలే కాక‌ ఈ వివాదంలోకి న్యాయమూర్తులు కూడా రావడం ఆసక్తి కలిగిస్తోంది.





Tags:    
Advertisement

Similar News