మంత్రి పదవుల కోసం షిండేపై రెబల్ గ్రూప్ ఒత్తిడి..

మంత్రివర్గం ఏర్పాటుకు మహారాష్ట్ర నూతన సీఎం షిండే ఎంత కసరత్తు చేసినా రెబల్ ఎమ్మెల్యేలు మాట వినడం లేదు.దీంతో ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకున్నారు. ఫడ్నవీస్‌ని తన బదులు ఢిల్లీ పంపుతున్నారు. ఏదైనా ఉంటే బీజేపీ అధిష్టానం వద్ద తేల్చుకోవాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.

Advertisement
Update:2022-08-05 13:45 IST

మీరు సీఎం అయ్యారు కదా, మా సంగతేంటి, కనీసం మమ్మల్ని మంత్రుల్ని చేయండి, తలా ఒక శాఖ ఇప్పించండి. కొంతకాలంగా మహారాష్ట్ర నూతన సీఎం షిండేపై రెబల్ ఎమ్మెల్యేలు ఇలా ఒత్తిడి తెస్తున్నారు. అందుకే ఆయన మంత్రి మండలి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఒత్తిడి ఎక్కువకావడం, మరోవైపు మంత్రి మండలి మహూర్తం దగ్గరపడటంతో షిండే అస్వస్థతకు గురయ్యారని సమాచారం. తీవ్ర ఒత్తిడితో ఉన్న షిండేకు రెండు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దీంతో ఢిల్లీ పర్యటన కూడా రద్దు చేసుకుని, ఆయన ముంబైలోనే సైలెంట్‌గా ఉన్నారు. ఆయనకు బదులు, మంత్రి మండలిపై ఆమోద ముద్ర వేయించుకోడానికి డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్తున్నారు.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ, శివసేన రెబల్ సహా.. చిన్నా చితకా పార్టీలన్నీ కలిపితే 167 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో బీజేపీకి 106 మెజార్టీ స్థానాలున్నా.. కేవలం 40 సీట్లు ఉన్న శివసేన రెబల్ నుంచి ఏక్ నాథ్ షిండేని సీఎంగా ఎంపిక చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఫడ్నవీస్ అధికారాన్నంతా తన చేతిలో పెట్టుకోవాలనుకున్నారు. మంత్రి మండలిలో కూడా బీజేపీకే మెజార్టీ సీట్లు దక్కే అవకాశముంది. కానీ షిండే వర్గం ఎక్కడా తగ్గడంలేదు. షిండేతో బయటకొచ్చే సమయంలోనే వారు ఒప్పందాలు చేసుకున్నారు. షిండే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రెబల్ ఎమ్మెల్యేలంతా మంత్రి పదవులు ఆశించడం సహజం. దీనికోసం షిండేపై ఆ స్థాయిలో ఒత్తిడి ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

మహారాష్ట్రలో గరిష్టంగా 43 మంత్రి పదవులు ఇవ్వొచ్చు. పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశం పెట్టుకున్నారు. ఆలోగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. షిండే ఎంత కసరత్తు చేసినా రెబల్ ఎమ్మెల్యేలు మాట వినడం లేదు. దీంతో ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకున్నారు. ఫడ్నవీస్‌ని తన బదులు ఢిల్లీ పంపిస్తున్నారు. ఏదైనా ఉంటే.. బీజేపీ అధిష్టానం వద్ద తేల్చుకోవాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు, తనకు అనారోగ్యం అంటూ ముంబైలోనే ఉండిపోయారు. రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్టానాన్ని ధిక్కరించే అవకాశం తక్కువ. ఒకవేళ ధిక్కరించినా బుజ్జగించడం, వచ్చే దఫా బీజేపీ టికెట్ గ్యారెంటీ అని హామీ ఇవ్వడం.. అన్నీ అధిష్టానం చూసుకుంటుంది. అందుకే షిండే.. ఆ బంతిని బీజేపీ కోర్టులో వేశారు. మొత్తమ్మీద సీఎం పదవి షిండేకి అప్పగించినా.. పెత్తనం మాత్రం ఫడ్నవీస్ చేతుల్లోనే ఉండబోతుందని మరోసారి స్పష్టమైంది.

Tags:    
Advertisement

Similar News