గడ్డంతో వచ్చారో.. పెళ్లిపీటలెక్కనీయం.. కుల పెద్దల వార్నింగ్

ఈసారి మాత్రం అలా గడ్డంతో రావడానికి వీలులేదని సూచించారు. పెళ్ళికొడుకులు గడ్డం పెంచుకొని వస్తే పెళ్లి పీటలు ఎక్కనివ్వమని హెచ్చరించారు.

Advertisement
Update:2023-03-10 20:25 IST

ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే మగవారు గడ్డాలు, మీసాలు పెంచేది ఇండియాలోనే ఎక్కువ. ముఖ్యంగా నార్త్ తో పోలిస్తే సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ. ఇక్కడ గడ్డాలు, మీసాలు లేకుండా చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. అయితే గడ్డాలు, మీసాలు భారీగా పెంచేవారు కూడా గతంలో పెళ్లి అంటే మాత్రం క్లీన్ సేవ్ తో కనిపించేవారు.

పెళ్ళికొడుకు గడ్డంతో కనిపిస్తే అంతా ఆశ్చర్యపోయేవారు. అయితే రాను రానూ ఈ సంస్కృతి మారింది. గడ్డం ఇప్పుడు ఫ్యాషన్ అయ్యింది. ఇప్పటి యూత్ స్టైల్ గా గడ్డాన్ని ట్రిమ్ చేసుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ కుల పెద్దలు మాత్రం సామూహిక వివాహాల సందర్భంగా పెళ్లి కుమారులు గడ్డంతో వస్తే పెళ్లి పీటలు ఎక్కనివ్వమని హెచ్చరించారు.

రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ గ్రామంలో కుమావత్ సమాజ్ వర్గానికి చెందినవారు ఏటా సామూహిక వివాహాలు జరిపిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా మే 5వ తేదీన సామూహిక వివాహాలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పేర్లు కూడా నమోదు చేసుకుంటున్నారు.

అయితే సామూహిక వివాహాలు చేసుకుంటామని వస్తున్నవారికి కుల సంఘ పెద్దలు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. గతంలో సామూహిక వివాహాలు జరిపిన సమయంలో చాలామంది పెళ్ళికొడుకులు మీసాలు, గడ్డాలతో హాజరయ్యారని, కానీ ఈసారి మాత్రం అలా గడ్డంతో రావడానికి వీలులేదని సూచించారు. పెళ్ళికొడుకులు గడ్డం పెంచుకొని వస్తే పెళ్లి పీటలు ఎక్కనివ్వమని హెచ్చరించారు.

పేర్లు నమోదు చేసుకునే సమయంలోనే ఈ నిబంధనకు సంబంధించి సంతకం కూడా పెట్టించుకుంటున్నారు. ఇటీవల కుమావత్ సమాజ్ పెద్దలు ఒక సమావేశం నిర్వహించుకున్నారు. సామూహిక వివాహ మహోత్సవాలకు సాంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళికొడుకులు గడ్డంతో రావడంపై చర్చించారు. ఈ దఫా ఆ విధంగా జరగకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం నిబంధనలు విధించారు. కుల పెద్దలు తీసుకున్న నిర్ణయానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా మద్దతు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News