కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెహ్లాట్ వైపే మొగ్గు.. శశిథరూర్ కొన్నాళ్లు ఆగాల్సిందే.!

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి తాను ఎన్నికైనా.. రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానని అశోక్ గెహ్లాట్ చెబుతున్నారు. కాంగ్రెస్‌లో జోడు పదవులకు వ్యతిరేకంగా గతంలో తీర్మానం చేశారు. దీని ప్రకారం గెహ్లాట్ కచ్చితంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.

Advertisement
Update:2022-09-21 16:56 IST

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీని నడిపిస్తాడనుకున్న రాహుల్ గాంధీ.. పార్టీ కోసం దేశమంతా నడుస్తాను కానీ.. పార్టీ కాడిని మాత్రం మోయలేనని తేల్చి చెప్పేశారు. పార్టీలోని సీనియర్లు, జూనియర్ల మధ్య ప్రతీ నిత్యం గొడవలు జరుగుతుండటం.. పీసీసీల్లో కూడా తీర్చలేని సమస్యలు ఉండటంతోనే రాహుల్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ పటేల్ చనిపోవడం, గులాం నబీ ఆజాద్ పార్టీకి దూరమవడంతో ఆ బాధ్యతలు ఎవరు చేపడతారంటే అన్ని వేళ్లు సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ వైపే చూపిస్తున్నాయి. మరోవైపు శశిథరూర్ కూడా పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. దీంతో రాహుల్ గాంధీని ఆ పదవి కోసం ఒప్పించడానికి మరోసారి సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తి అయితేనే ఒక్కతాటిపైకి తీసుకొని వస్తారని.. ఇతరులు అయితే పార్టీలో లుకలుకలు మొదలవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ కూడా ఆ పదవిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని.. ఉన్న సీఎం పదవిని పోగొట్టుకొని పార్టీ పగ్గాలు చేపట్టడంపై ఆయన పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజస్థాన్ పీసీసీ ద్వారా రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై ఏకగ్రీవ తీర్మానం చేయించి తన మనసులో మాటను గెహ్లాట్ చెప్పకనే చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతల్లో గెహ్లాట్ వైపే గాంధీ కుటుంబం కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

అశోక్ గెహ్లాట్‌తో పాటు శశిథరూర్ కూడా పోటీ పడుతున్నారు. ఐక్యరాజ్యసమితిలో పని చేసిన అనుభవం.. సుదీర్ఘ కాలం ఎంపీగా ఉండటం ఆయనకు కలిసి వస్తోంది. మంచి మాటకారి అయిన శశిథరూర్‌కు రాజకీయ కెరీర్‌లో వివాదాలు లేవు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం వివాదాస్పదం కావడం ఓ మైనస్‌గా చెప్పుకోవచ్చు. గెహ్లాట్.. గాంధీ ఫ్యామిలీకి వీర విధేయుడు. కానీ శశిథరూర్ తరచూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. జీ23 బృందంలో సభ్యుడైన థరూర్.. పలుమార్లు రాహుల్ పార్టీని నడిపించే తీరుపై విమర్శలు చేశారు. అయితే, నామినేషన్ల ప్రక్రియ మొదలు కాక ముందే రాహుల్ గాంధీని అశోక్ గెహ్లాట్ కలవబోతున్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌ను స్వయంగా కలిసి పార్టీ పగ్గాలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నది. అప్పటికీ రాహుల్ విముఖత చూపిస్తే గెహ్లాట్ నామినేషన్ వేస్తారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి తాను ఎన్నికైనా.. రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానని అశోక్ గెహ్లాట్ చెబుతున్నారు. కాంగ్రెస్‌లో జోడు పదవులకు వ్యతిరేకంగా గతంలో తీర్మానం చేశారు. దీని ప్రకారం గెహ్లాట్ కచ్చితంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఆయన జాతీయ అధ్యక్షుడు అయితే రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలెట్‌ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కాగా, సీఎం పదవి ఉంటేనే తాను జాతీయ అధ్యక్ష పదవిలో కొనసాగుతాననే సంకేతాలు పంపిస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. రేపు పార్టీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ వెలువడనుండగా.. 25 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనివార్యం అయితే అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న ఫలితం ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9వేల మంది ప్రతినిధులు తన తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

Tags:    
Advertisement

Similar News