కోటాలో ఆత్మహత్యలకు తల్లిదండ్రులూ కారణమే
విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీరియస్ అయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యల నిరోధం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
రాజస్థాన్‌లోని కోటాలో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. మరణాలను నిరోధించడానికి, సూచనలు అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ కమిటీ 15 రోజుల్లో నివేదికను సమర్పిస్తుందని ప్రకటించారు. కోటాలో ఐఐటీ, నీట్ ఔత్సాహికుల ఆత్మహత్యల కేసులపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులపై తల్లిదండ్రులే అధిక భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9, 10వ తరగతి నుంచే విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో చేర్చడం ద్వారా తల్లిదండ్రులు నేరం చేస్తున్నారన్నారు. విద్యార్థులు బోర్డు పరీక్షలను క్లియర్ చేసుకోవడమే కాక అదే సమయంలో ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే భారాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 9, 10వ తరగతి విద్యార్థులను అసలు చేర్చుకోవద్దని కోచింగ్ సెంటర్ల ప్రతినిధులకు సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని, ఒక్కరు చనిపోయినా అది ఆ తల్లిదండ్రులకు తీరని లోటన్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల మరణాలను నిరోధించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్ల ప్రతినిధులతోపాటు తల్లిదండ్రులు, వైద్యులతో సహా అన్ని వర్గాలకు చెందిన వారితో కూడిన ఈ కమిటీ 15 రోజుల్లో తన నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారిలో ఈ ఏడాది ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది మొత్తంలో 15 మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 22కి చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.