పరామర్శకు వీల్లేదు.. మణిపూర్ లో రాహుల్ ని అడ్డుకున్న పోలీసులు
మణిపూర్‌కు చెందిన సోదరులు, సోదరీమణులందరూ చెప్పే విషయాలను వినేందుకు వచ్చానని, వారంతా తనను ప్రేమతో దగ్గరకు తీసుకున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పారు.
అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఉంది మణిపూర్ ప్రజల పరిస్థితి. అధికార బీజేపీ మణిపూర్ బాధితులకు సాంత్వన ఇవ్వదు, పరామర్శకు వచ్చిన ప్రతిపక్షాలను మాత్రం పోలీసులు అడ్డుకుంటారు. తాజాగా రాహుల్ గాంధీ పర్యటనను మణిపూర్ లో పోలీసులు అడ్డుకోవడంతో కలకలం రేగింది. మణిపూర్ గాయం మానేందుకు సహకరించకుండా స్థానిక ప్రభుత్వం పంతాలకు పోతోందని ఆయన మండిపడ్డారు. శాంతి స్థాపనే ప్రభుత్వాల ఏకైక అజెండాగా ఉండాలన్నారు రాహుల్.
మణిపూర్ కు రాహుల్..
మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు రాహుల్ గాంధీ చేరుకున్న సందర్భంలో బాధితుల్ని ఆయన కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా పరమైన కారణాలు చూపుతూ చుర్ చందనాపూర్ కు బయలుదేరిన ఆయన కాన్వాయ్ ను అడ్డగించారు. దీంతో ఆయన హెలికాప్టర్ లో అక్కడికి వెళ్లారు. సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలను పరామర్శించారు. మణిపూర్ ప్రజలు తనను ప్రేమతో ఆహ్వానించి అక్కున చేర్చుకున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. మణిపూర్‌కు చెందిన తన సోదరులు, సోదరీమణులందరూ చెప్పే విషయాలను వినేందుకు వచ్చానని, వారంతా తనను ప్రేమతో దగ్గరకు తీసుకున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పారు.
మోదీ మౌనం దేనికి సంకేతం..
మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మౌనాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు సహకరిస్తామని, అమెరికాలో ఘనంగా చెప్పుకున్న మోదీ, మణిపూర్ అల్లర్లను ఆపేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదని అడుగుతున్నారు. మణిపూర్ విషయంలో బీజేపీ చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకీ ఆందోళనలు పెరుగుతుండే సరికి మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. అటు కేంద్రం కూడా సైలెంట్ గా ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం.