బెలగావి నుంచి కొత్త శక్తులతో 2025లో అడుగు పెడుతాం

నెహ్రూ, గాంధీ స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడుతాం : సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే

Advertisement
Update:2024-12-26 18:37 IST

బెలగావిలో నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశాలతో కొత్త శక్తులు సంతరించుకొని 2025వ సంవత్సరంలోని అడుగు పెడుతామని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం కర్నాటకలోని బెలగావిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నెహ్రూ, గాంధీ స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న అబద్ధాపు ప్రచారాన్ని ఛేదించి కొత్త ఉత్తేజంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ అమలుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. పార్టీని సంస్థాగతంగా పునరుద్దరిస్తామని.. పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన అన్ని శక్తులను ప్రోది చేసుకుంటామన్నారు. భారత రాజ్యాంగ రక్షణకు కట్టుబడి ఉన్న వ్యక్తులను కలుపుకొని ముందుకు వెళ్లామన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలు నమ్మకం కోల్పోయారని.. ఇది ఆందోళనకరమైన పరిణామమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ తమ గుత్తాధిపత్యంలో పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఎన్నికల నిబంధనలను మార్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ చర్యలు బయట పడకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నాలు చేయడంతోనే ప్రజలు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం కోల్పోతున్నారని తెలిపారు. దీనిపై ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. నెహ్రూ - గాంధీ సిద్ధాంతాల కోసం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గౌరవం కోసం తుదిశ్వాస వరకు పోరాడుతామని ఖర్గే ప్రకటించారు.


 



మహాత్మాగాంధీ ఏఐసీసీ పగ్గాలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నవ్‌ సత్యాగ్రహ బైఠక్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ బెలగావిలో రెండు రోజుల పాటు వర్కింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. వర్కింగ్‌ కమిటీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు సహా 200 మంది ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌ లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పై చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. బెలగావిలో శుక్రవారం 'జై బాపు.. జై భీమ్‌.. జై కానిస్ట్యూషన్‌' నినాదంతో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ తలపెట్టింది. 2024 సంవత్సరాంతంలో నిర్వహిస్తోన్న వర్కింగ్‌ కమిటీ సమావేశాలతో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త శక్తి తీసుకురావడంతో పాటు ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తగిలిన ఎదురు దెబ్బలు, వాటి నుంచి భవిష్యత్‌ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా అనేక కీలక అంశాలపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.




 


Tags:    
Advertisement

Similar News