ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను తొలిగించాలి : ఆప్
ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ మిత్రపక్షాల్ని కోరింది.
ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని తొలిగించాలని మిత్రపక్షాల్ని కోరుతామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించాడానికి బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ గెలుపు కోసం పనిచేస్తోందని మాజీ సీఎం కేజ్రీవాల్‌ను యాంటీ నేషనల్ అని విమర్శించిన కాంగ్రెస్ నేత అజయ్ మాకన్‌పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోతే కూటమి నుంచి ఆ పార్టీని తొలగించాలని కోరతామన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే ఇందుకు కారణం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం, ఓడిపోవడంతో కూటమి నేతలు ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ఇండియా కూటమికి తాను చీఫ్‌గా ఉండాలనుకుంటున్నట్టు మమతా బెనర్జీ చెప్పడంతో మరింత ఉత్కంఠను పెంచింది. ఈ క్రమంలో కూటమిలో పలు పార్టీల నేతలు కూడా మమతకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి పరిణామాల మధ్య ఆప్ తాజా నిర్ణయం కూటమిలో చిచ్చు పెట్టిందని పొలిటికల్ సర్కిల్ చర్చ నడుస్తోంది. ఢిల్లీలో మహిళా సమ్మాన్ యోజనతో పాటు సంజీవని యోజనను ప్రభుత్వం నోటిఫై చేయలేదని ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం సరికాదని ఆప్ అంటోంది.ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ తప్పుడు, మోసపూరిత హామీలను ఇస్తోందని యూత్ కాంగ్రెస్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలు, ఎంసీడీ కౌన్సిలర్‌లు సహా ఆప్ నాయకులు ఓటీపీ ధ్రువీకరణ అవసరమయ్యే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ఓటర్ ఐడీ వివరాలు, ఫోన్ నంబర్‌ల వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది.