భారతమాత ముద్దుబిడ్డ మన్మోహన్‌ మృతిపై ప్రముఖుల సంతాపం

విశిష్ట వ్యక్తిని కోల్పోయిందంటూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళి

Advertisement
Update:2024-12-27 08:50 IST

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి: రాష్ట్రపతి ముర్ము

విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌ ఒకరు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. భారత మాట ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను.

భారత దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు: ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌

మన్మోహన్‌ సింగ్‌ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురిచేసింది. ఆయన భారత దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు. ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా పేరు గడించారు. ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు. దేశాభివృద్ధిలో ఎన్నో ద్వారాలు తెరిచారు. ఉపరాష్టపతిగా ఆయనతో ఎన్నో సంభాషణలు జరిపాను. ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారతదేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవి: మోడీ

భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్‌ సింగ్‌ను కోల్పోయింది. ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు. ప్రధానిగానే కాకుండా ఆర్థికమంత్రితో పాటు ఎన్నో విభాగాల్లో పనిచేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారు. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి ఎంతో కృషి చేశారు. మన్మోహన్‌ ప్రధానిగా, నేను గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు తరుచూ మాట్లాడుకునేవాళ్లం. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే వాళ్లం. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవి. ఆ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. అని మోడీ పేర్కొన్నారు.

ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర : అమిత్‌ షా

మాజీ ప్రధాని మన్మోహన్‌ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నా.

మార్గదర్శిని కోల్పోయాను: రాహుల్‌

గురువు, మార్గదర్శిని కోల్పోయాను. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్‌ దేశాన్ని నడిపించారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన లోతైన అవగాహణ దేశానికి స్ఫూర్తి. మన్మోహన్‌ సింగ్‌ కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

మన్మోహన్‌ సింగ్‌ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ఏసీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. మన్మోహన్‌ కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాడ సానుభూతి. కేంద్ర ఆర్థికమంత్రిగా దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కేంద్రమంత్రిగా, ప్రధాని గా దేశానికి నిర్వరామంగా సేవలందించారు.

నవభారత నిర్మాత మన్మోహన్‌: రేవంత్‌రెడ్డి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్‌ సింగ్‌ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది. ఆయన తీసుకున్న అసమాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటి. మన్మోహన్‌సింగ్‌.. అసలైన నవ భారత నిర్మాత. భారత మాట ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది.

దేశం దూరదృష్టి కలిగిన రాజనీతజ్ఞుడిని కోల్పోయింది: ఖర్గే

మన్మోహణ్‌ సింగ్‌ పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతజ్ఞుడిని కోల్పోయింది. మన్మోహన్‌ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్తించాయి. మన్మోహన్‌ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుంది.

ఉన్నత శిఖరాలకు చేరకున్న భారత మాత ముద్దు బిడ్డ: కేసీఆర్‌

మాజీ ప్రధాని మన్మోహన్‌ మృతి పట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్‌తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో మన్మోహన్‌ తన విద్యత్వును ప్రదర్శించారు. ఆయన ఉన్నత శిఖరాలకు చేరకున్న భారత మాత ముద్దు బిడ్డ. ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

మన్మోహన్‌నిజాయితీ మాకు ఎప్పుడూ స్ఫూర్తి: ప్రియాంక

రాజకీయాల్లో కొంతమంది నేతలు మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారు. వారిలో ఒకరు మన్మోహన్‌ సింగ్‌. ఆయన నిజాయితీ మాకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేసినా నిబద్ధతతో దేశానికి సేవ చేశారు. ఆయన ఎంతో తెలివైన, ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి. కఠినమైన రాజకీయ ప్రపంచంలో ప్రత్యేక గౌరవప్రదమైన, సున్నిత వ్యక్తిగా చివరి వరకు కొనసాగారు.

మన్మోహన్‌ గొప్ప దయగల వ్యక్తి : శశిథరూర్‌

ప్రపంచదేశాలన్నీ ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్నప్పుడు మన్మోహన్‌ సింగ్‌ భారత్‌ను ప్రగతి పథకంలో నడిపారని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశంలో ఎన్నో మంచి మార్పులు సంభవించాయన్నారు. మన్మోహన్‌ గొప్ప దయగల వ్యక్తి అని, అలాంటి గొప్ప వ్యక్తి మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అన్నారు. 

Tags:    
Advertisement

Similar News