వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతకు పంజాబ్ పరిష్కారం..

ఇకపై గడ్డిని ఎవరూ పొలంలో తగలబెట్టడానికి వీలు లేదని, దాన్ని ఇటుక బట్టీలకు సరఫరా చేయాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Advertisement
Update:2022-11-14 16:36 IST


ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్ లో వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతకు అవినాభావ సంబంధం ఉంది. శీతాకాలం మొదలయ్యే సమయంలో పంజాబ్ లో వ్యవసాయ వ్యర్థాలను పెద్ద ఎత్తున కాల్చివేస్తారు. ఆ పొగ, దుమ్ము, ధూళి వాతావరణంలో కలసిపోయి, ఢిల్లీలో దాని ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ ఆధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఏడాదిలోగా దీనికి శాశ్వత పరిష్కారం కనిపెడతామని ప్రకటించింది. ఈమేరకు రెండు రాష్ట్రాల సీఎంలు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలో ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వ్యవసాయ వ్యర్థాలను నేరుగా పొలాల్లో తగలబెట్టకుండా ఇటుక బట్టీలకు సరఫరా చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. వాస్తవానికి వరికోత అయిపోయిన తర్వాత గడ్డిని రైతులు పశుగ్రాసం కోసం అమ్మేస్తారు. అది వారికి లాభం కూడా. కానీ పంజాబ్ లో గడ్డిని పొలంలోనే కాల్చి వేస్తారు. గడ్డికోయడానికి, రవాణా చేయడానికి అయ్యే ఖర్చు మిగిలిపోతుందని, సమయం కూడా ఆదా అవుతుందనేది వారి ఆలోచన. కానీ ఇకపై గడ్డిని ఎవరూ పొలంలో తగలబెట్టడానికి వీలు లేదని, దాన్ని ఇటుక బట్టీలకు సరఫరా చేయాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఇటుకబ‌ట్టీ య‌జ‌మానులు కూడా ఈ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే. గతంలో ఇటుకలను కాల్చేందుకు బొగ్గు, కర్రలు, వరిపొట్టుని వాడేవారు. ఇకపై గడ్డి కూడా అందులో భాగం చేయాలని, ఇంధ‌నంలో 20 శాతం వ‌రిగ‌డ్డిని త‌ప్ప‌నిస‌రిగా వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరిగ‌డ్డిని పొలాల్లో కాల్చ‌డం ద్వారా వచ్చే కాలుష్యాన్ని ఇలా అడ్డుకోవాలనుకుంటోంది పంజాబ్ ప్రభుత్వం. వ‌రిగ‌డ్డిని ఇటుక బ‌ట్టీల య‌జ‌మానుల‌కు అమ్మ‌డం ద్వారా రైతులు ఆర్థికంగా లాభ‌ప‌డ‌తారని అంచనా వేస్తోంది.

వరికోతల సమయంలో గడ్డిని వేరు చేసేందుకు, రవాణా చేసేందుకు లక్షన్నరమంది రైతులకు సబ్సిడీ ద్వారా యంత్రాలను అందిస్తామని ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం. ఇతర రాయితీలు కూడా ఇస్తామని ప్రకటించింది. ఇలాంటి తాయిలాలతో రైతులు నేరుగా గడ్డిని పొలాల్లో తగలబెట్టకుండా చూస్తామంటోంది. అయితే ఈ నూతన నిబంధనలు ఎంతవరకు అమలులోకి వస్తాయి, దీనివల్ల ఢిల్లీ కాలుష్యం ఏమేరకు తగ్గుతుందనేది ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News